2100 రైతుల అప్పులు తీర్చిన సూపర్ స్టార్

బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. బీహార్‌కు చెందిన 2100 మంది రైతుల అప్పులు స్వయంగా తీర్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు. గత ఏడాది బీహార్‌లో అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనల వార్తలు తెలుసుకున్న అమితాబ్.. అప్పుడే తాను ఆ రైతుల అప్పులు తీరుస్తానని మాట ఇచ్చారు.

గత ఏడాది ఇచ్చిన మాట ప్రకారం ఎంపిక చేసిన నిరుపేదలైన 2100 మంది రైతుల అప్పులను ఆయన తీర్చేశారు. ఈ విషయాన్ని తన బ్లాగ్‌లో పంచుకున్నారు. ‘గతంలో ప్రామిస్ చేసినట్లుగా రైతుల అప్పులు తీర్చేశాను.. కొంత మంది రైతులకు డబ్బులు నేరుగా అకౌంట్లో వేశాను.. మరి కొంత మందికి మాత్రం అభిషేక్ బచ్చన్, శ్వేత (అమితాబ్ కూతురు) స్వయంగా చెక్కులు అందించారు’ అని అమితాబ్ ఆ బ్లాగ్‌లో రాసుకొచ్చారు.

అంతకు మునుపు కూడా తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో దాదాపు వెయ్యి మంది రైతులకు 5.5 కోట్ల రూపాయల రుణాన్ని అమితాబ్ తీర్చారు. అమితాబ్ చేసిన ఈ గొప్ప పనికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బు సంపాదించడమే కాకుండా ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకొని తనలోని మానవత్వాన్ని చాటుకున్నారని ప్రశంసిస్తున్నారు.