హమ్మయ్య.. భీష్మ మొదలైంది

కొందరేమో ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది అంటారు. మరికొందరేమో సినిమా ఆగిపోయిందంటారు. ఇంకొందరు మాత్రం వివాదాలు నడుస్తున్నాయని చెబుతారు. ఇలా ఎన్నో ఊహాగానాలు, పుకార్ల మధ్య నలిగిన భీష్మ సినిమాపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది.

ఛలో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. డిసెంబర్ నెలలో చిత్రం విడుదలయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.

నిజానికి రష్మిక కాల్షీట్లు ఎడ్జెస్ట్ అవ్వకపోవడం వల్లనే భీష్మ సినిమా లేట్ అయినట్టు తెలుస్తోంది. ఆమె 20వ తేదీ నుంచి కాల్షీట్లు కేటాయించిందట. మరోవైపు ఛలో సినిమాకు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ నే భీష్మ సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా సెలక్ట్ చేశారు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. ఛలో సినిమా టైపులోనే రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తోంది భీష్మ.