బీజేపీకి ట‌చ్‌లో… ఇద్ద‌రు కాంగ్రెస్ ఎంపీలు?

తెలంగాణ కాంగ్రెస్‌లో మ‌రో క‌ల‌క‌లం. మొన్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఇద్ద‌రు ఎంపీలు బీజేపీకి ట‌చ్‌లో ఉన్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన ఈ ఇద్ద‌రు ఎంపీలు బీజేపీ సీనియ‌ర్ నేత‌ల‌తో స‌మావేశ‌మైన‌ట్లు తెలుస్తోంది.

బీజేపీకి ట‌చ్‌లో ఉన్న ఆ ఇద్ద‌రు కాంగ్రెస్ ఎంపీలు ఎవ‌రు? అనే విష‌యంపై కాంగ్రెస్‌లో తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. కానీ ఆయ‌న క‌రుడు గ‌ట్టిన కాంగ్రెస్ వాది. పీసీసీ చీఫ్‌. ఆయ‌న పార్టీ మారే అవ‌కాశం లేదు. ఇక మిగిలింది ఇద్ద‌రు ఎంపీలు. ఒక‌రు రేవంత్‌రెడ్డి, మ‌రొక‌రు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.

ఈ ఇద్ద‌రు ఎంపీలు ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన‌ప్పుడు రాంమాధ‌వ్‌ను క‌లిసిన‌ట్లు స‌మాచారం. బీజేపీలో చేరిక‌పై ప్రాథ‌మిక స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈవిష‌యాన్ని బీజేపీ వ‌ర్గాలు మాత్రం ధృవీక‌రిస్తున్నాయి. బీజేపీకి ట‌చ్‌లో ఉన్న ఇద్ద‌రు ఎంపీలు అన్న బ్రేకింగ్ న్యూస్ టీవీ చాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌వుతున్న వేళ రేవంత్ మాత్రం హైద‌రాబాద్‌లోనే ఉన్నారు, ఆ సమయంలో సినీ మాక్స్‌లో సినిమా చూశార‌ని తెలుస్తోంది.

బీజేపీలోకి త‌న‌తో పాటు కీల‌క నేత‌లను తీసుకుపోవాల‌ని రేవంత్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఇందులో భాగంగా మాజీ ఎంపీ వివేక్‌తో ఆయ‌న బుధ‌వారం కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపారు. బీజేపీలోకి వెళ్ల‌డంపైనే ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

టీఆర్ఎస్‌ను ఎదుర్కొవాలంటే కాంగ్రెస్ స‌రైన ఫ్లాట్‌ఫామ్ కాద‌ని రేవంత్ అభిప్రాయంగా తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోపు కూడా కాంగ్రెస్‌ కోలుకునే అవ‌కాశం లేద‌నేది…. రేవంత్ టీమ్ ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరితే రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉంటుంద‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

అయితే రేవంత్ మాత్రం కాంగ్రెస్‌లో చేరేముందు కూడా ఇలాగే ప‌దేప‌దే వివ‌ర‌ణ‌లు ఇచ్చారు. కాంగ్రెస్‌లో చేరేది లేద‌ని అన్నారు. కానీ చివరకు కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు కూడా బీజేపీ వైపు ఆయ‌న చూపు ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు రేవంత్ మ‌ల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు.

రేవంత్ పార్టీ మారుతార‌ని వార్త నెల‌రోజులుగా వైర‌ల్ అవుతోంది. దీంతో రేవంత్ స్వ‌యంగా వివ‌ర‌ణ ఇచ్చారు. గాంధీభ‌వ‌న్‌లో జ‌రిగిన స‌న్మాన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. తాను పార్టీ మార‌డం లేదని చెప్పుకొచ్చారు. సోష‌ల్ మీడియాలో త‌మ వ్యాపారం కోసం త‌న పేరు వాడుకుంటున్నార‌న్నారు.

తెలంగాణ‌లో ఎంఐఎం స‌హ‌కారంతో బీజేపీ ఎంపీలు గెలిచార‌ని రేవంత్ దుమ్మెత్తిపోశారు. ప్ర‌తిప‌క్షంలో ఉండి పోరాడేందుకు ప్ర‌జ‌లు త‌న‌ను ఎంపీగా గెలిపించార‌ని అన్నారాయ‌న‌. మొత్తానికి తాను పార్టీ మార‌డం లేద‌ని మాత్రం రేవంత్ ఇటీవ‌లే క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ పార్టీ మారుతున్నారనే వార్తలు వినపడుతూనే ఉన్నాయి.