కల్యాణ్ రామ్ కుటుంబకథా చిత్రం

డిఫరెంట్ జానర్స్ ట్రై చేయడం కల్యాణ్ రామ్ కు ఇష్టం. నటుడిగా తననుతాను నిరూపించుకోవడానికి ఎప్పుడూ తహతహలాడుతుంటాడు. రీసెంట్ గా 118 సినిమా చేశాడు. అది థ్రిల్లర్ జానర్ కథ. ఇప్పుడీ హీరో ఓ కుటుంబ కథా చిత్రానికి ఓకే చెప్పాడు. ఇలాంటి సినిమాలకు పెట్టింది పేరైన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నటించబోతున్నాడు.

ఈ సినిమాతో ఆదిత్య మ్యూజిక్ సంస్థ నిర్మాణ రంగంలోకి ఎంటరైంది. ఇంతకుముందు కార్తి నటించిన ఖాకి సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన ఈ సంస్థ.. కల్యాణ్ రామ్ సినిమాతో పూర్తిస్థాయి నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. ఈ సినిమాకు మొదట ఆల్ ఈజ్ వెల్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో కొత్త టైటిల్ కోసం అన్వేషిస్తున్నారు.

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ ఈ సినిమాను స‌మ‌ర్పించనున్నాడు. `గీత గోవిందం`, `మ‌జిలీ` లాంటి మ్యూజిక‌ల్ హిట్స్ ఇచ్చిన గోపీసుంద‌ర్, ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. హ్యాపెనింగ్ బ్యూటీ మెహ్రీన్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. కల్యాణ్ రామ్, మెహ్రీన్ కాంబోలో ఇదే మొదటి సినిమా.