Telugu Global
NEWS

నేటి నుంచి పాఠశాలల సందడి..!

చిన్నారుల సరదాకు తెరపడింది. చిన్నారుల ఆట పాటలకు అడ్డుపడింది. రెండు నెలలపాటు హాయిగా కేరింతలు కొట్టిన బాల్యం పాఠశాలలకు పయనమవుతోంది. తెలుగు రాష్ట్రాలలో బుధవారం ఉదయం నుంచి పాఠశాలల సందడి ప్రారంభం కానుంది. ఇన్నాళ్లు మూతబడ్డ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బుధవారం నుంచి పని చేయనున్నాయి. నిజానికి ఈ నెల 3 వ తేదీ నుంచే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వేసవి ఎండలు దారుణంగా ఉండడంతో సెలవులను పది రోజుల పాటు పొడిగించారు. దీంతో […]

నేటి నుంచి పాఠశాలల సందడి..!
X

చిన్నారుల సరదాకు తెరపడింది. చిన్నారుల ఆట పాటలకు అడ్డుపడింది. రెండు నెలలపాటు హాయిగా కేరింతలు కొట్టిన బాల్యం పాఠశాలలకు పయనమవుతోంది.

తెలుగు రాష్ట్రాలలో బుధవారం ఉదయం నుంచి పాఠశాలల సందడి ప్రారంభం కానుంది. ఇన్నాళ్లు మూతబడ్డ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బుధవారం నుంచి పని చేయనున్నాయి. నిజానికి ఈ నెల 3 వ తేదీ నుంచే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది.

అయితే వేసవి ఎండలు దారుణంగా ఉండడంతో సెలవులను పది రోజుల పాటు పొడిగించారు. దీంతో బుధవారం నుంచి తొమ్మిది నెలల పాటు పాఠశాలలు పనిచేయనున్నాయి. ఫీజుల మోత తల్లిదండ్రులను ఇబ్బందుల పాలు చేస్తుంటే… ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర సౌకర్యాలు కలవరం తెప్పిస్తున్నాయి.

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపై తెలుగు రాష్ట్రాల్లో కొలువైన ప్రభుత్వాలు ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం తల్లిదండ్రులకు శాపంగా మారింది. ఎల్ కేజీ స్థాయి నుంచి వేలాది రూపాయల డొనేషన్ లు, లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ బొక్కసాలు నింపుకుంటున్నాయి.

ప్రైవేటు స్కూల్లో ఫీజుల నియంత్రణ చేపట్టలేని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కనీసం విద్యార్థుల పుస్తకాల బరువును కూడా తగ్గించే ప్రయత్నాలు చేయడం లేదు. బండెడు పుస్తకాలతో.. నడుములు వొంగి పోయే బ్యాగులతో చిన్నారుల బాల్యం ఛిద్రమవుతోంది.

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలలో వచ్చిన అవకతవకలతో తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖ పరువు బజారున పడింది. విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయినా ఇక్కడి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో నెలకొన్న అరిష్టాలను ఏ మేరకు తొలగిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ కష్టాలు, ఇబ్బందులు, ఫీజుల అగచాట్లు తెలియని చిన్నారులు మాత్రం పుస్తకాల మోతతో పాఠశాలలకు పరుగులు తీస్తున్నారు.

First Published:  11 Jun 2019 8:38 PM GMT
Next Story