ఆ చాంబ‌ర్ వ‌ద్దే వ‌ద్దు అంటున్న‌ మంత్రులు !

అమ‌రావ‌తి కొత్త స‌చివాల‌యం. అన్ని హంగులు ఉన్నాయి ఆ చాంబ‌ర్‌లో… కానీ ఆ రూమ్ మాత్రం వ‌ద్దు అంటున్నారు కొత్త మంత్రులు. సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కూ ఎవ‌రూ ఆ చాంబ‌ర్ వైపు చూడ‌డానికి ఇష్ట ప‌డ‌డం లేదు. ఎందుకంటే ఐరెన్‌లెగ్ చాంబ‌ర్‌గా ముద్ర‌ప‌డింది.

స‌చివాల‌యంలోని ఐదో బ్లాక్‌లో మాజీ మంత్రి లోకేష్ చాంబ‌ర్ ఉంది. ఈ చాంబ‌ర్‌ను కొత్త మంత్రి, చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి కేటాయించారు. ఆయ‌న మాత్రం ఆ చాంబ‌ర్ వ‌ద్ద‌నుకున్నారు. మూడో బ్లాక్‌లోని 203 రూమ్‌ను త‌న చాంబ‌ర్‌గా ఎంచుకున్నారు.

లోకేష్ చాంబ‌ర్‌ను వేరే మంత్రులకు కేటాయించాల‌ని చూశారు. కానీ వారు కూడా వ‌ద్ద‌ని అంటున్నారట. లోకేష్ చాంబ‌ర్‌లో వాస్తు దోషాలు ఉన్నాయ‌నేది మంత్రుల న‌మ్మ‌కం. అక్క‌డ ఉండి లోకేష్ ఏం చేయ‌లేక‌పోయారు. విమ‌ర్శ‌ల పాల‌య్యారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. దీంతో ఆ చాంబ‌ర్ అంటేనే వ‌ద్దు బాబూ అంటున్నారు కొత్త మంత్రులు.

ఇంత‌కుముందు కూడా ఏపీ సీఎస్ ఆఫీసుకు స్వ‌ల్ప మార్పులు చేశారు. వెళ్లే దారుల‌ను మార్చారు. ఇప్పుడు కొంద‌రు మంత్రులు కూడా త‌మ చాంబ‌ర్‌లో వాస్తు మార్పులు చేసుకుంటున్నారు. మొత్తానికి వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో ఇప్పుడు లోకేష్ చాంబ‌ర్ హాట్ టాపిక్ అయింది.