ప్రపంచకప్ లో నేడు మరో కీలక సమరం

  • భారత్ కు న్యూజిలాండ్ సవాల్ 
  • వరుస విజయాలతో దూకుడుమీదున్న భారత్, న్యూజిలాండ్ 
  • నాటింగ్ హామ్ ను వెంటాడుతున్న వర్షం

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో మరో కీలక సమరానికి…హాట్ ఫేవరెట్ భారత్ సిద్ధమయ్యింది. నాటింగ్ హామ్ వేదికగా ఈ రోజు జరిగే మూడోరౌండ్ పోటీలో భారత్ కు న్యూజిలాండ్ సవాల్ విసురుతోంది. చెదురుమదరు జల్లులతో మ్యాచ్ కు అడపాదడపా అంతరాయం కలిగే అవకాశం సైతం లేకపోలేదని వాతావరణశాఖ హెచ్చరికలు చేసింది.

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రస్తుత ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో అజేయంగా నిలిచిన న్యూజిలాండ్, భారత్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. నాటింగ్ హామ్ వేదికగా ఈరోజు జరిగే ఈ పోటీ రెండుజట్లకూ కీలకంగా మారింది.

మొదటి మూడురౌండ్లలో అలవోక విజయాలు సాధించడం ద్వారా 6 పాయింట్లతో లీగ్ టేబుల్ టాపర్ గా న్యూజిలాండ్ నిలిస్తే…భారత్ సైతం.. ఆడిన రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ తిరుగులేని విజయాలతో నిలిచింది. వరుసగా మూడో విజయంతో సెమీస్ కు మార్గం సుగమం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

నయాఓపెనర్ తో భారత్..

డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో ముగిసిన రెండోరౌండ్ పోటీలో…స్ట్రోక్ ఫుల్ సెంచరీ సాధించిన ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో జట్టుకు దూరం కావడంతో…రోహిత్ శర్మతో కలసి రాహుల్ భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.

మ్యాచ్ కు వేదికగా ఉన్న నాటింగ్ హామ్ లో వాతావరణం స్వింగ్, సీమ్ బౌలర్లకు అనువుగా ఉండే అవకాశం ఉండడంతో…రెండుజట్లూ పేస్ బౌలింగే.. ప్రధాన అస్త్రంగా సమరానికి సై అంటున్నాయి.

మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, హార్థిక్ పాండ్యా, విజయ్ శంకర్ లతో కూడిన పేస్ ఎటాక్ తో భారత్ బరిలోకి దిగనుంది.

సమతూకంతో కివీస్ …

మరోవైపు…కేన్ విలియమ్స్ సన్ నాయకత్వంలోని న్యూజిలాండ్ అత్యంత సమతూకంతో కనిపిస్తోంది. మార్టిన్ గప్టిల్, రోజ్ టేలర్, కెప్టెన్ విలియమ్స్ సన్ బ్యాటింగ్ లోనూ…ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, నీషమ్ గ్రాండ్ హోమీ లాంటి పేసర్లతో న్యూజిలాండ్…పవర్ ఫుల్ భారత్ కు సవాలు విసురుతోంది.

డాట్ బాల్స్ వ్యూహం…

రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, పాండ్యా, ధోనీ ,రాహుల్ లాంటి పవర్ ఫుల్ హిట్టర్లతో కూడిన భారత టాపార్డర్ ను ఆత్మరక్షణలో పడేయటానికి… డాట్ బాల్స్ వేయటాన్ని మించిన ఆయుధం మరొకటిలేదని న్యూజిలాండ్ టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.

ప్రపంచకప్ కు సన్నాహకంగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో సైతం న్యూజిలాండ్ చేతిలో పరాజయం పొందిన విరాట్ సేన..ఈ అసలుసిసలు మ్యాచ్ లో మాత్రం హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

ఈ మ్యాచ్ లో భారత్ విజేతగా నిలిస్తే…వరుసగా మూడు అగ్రశ్రేణిజట్ల పైన నెగ్గినట్లవుతుంది.