సభను ఎలా నడపకూడదో కోడెల చూపించారు

ఆంధ్రప్రదేశ్ శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు శాసన సభను నిర్వహించిన తీరు అత్యంత దారుణంగా ఉండేదని సీనియర్ జర్నలిస్ట్‌ సి.హెచ్. వి. ఎం క్రిష్ణారావు అన్నారు.

“శాసన సభను ఎలా నడపకూడదో భావితరాలకు చెప్పేందుకు కోడేల శివప్రసాద రావు సభ నిర్వాహణ తీరే నిదర్శనం” అని ఆయన వ్యాఖ్యానించారు.

గురువారం ఉదయం ఓ తెలుగు ఛానల్ లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, ఆయన కుటుంబ సభ్యులు పాల్పడిన అవినీతి, అక్రమాలపై చర్చా గోష్ఠి జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ క్రిష్ణారావు మాట్లాడుతూ…. కోడెల శివప్రసాద రావు తనకు మిత్రుడే అయినా ఆయన సభ నడిపిన తీరు గురించి, కుటుంబ సభ్యుల అక్రమాల గురించి చర్చించడం తప్పడం లేదు అని అన్నారు.

మాజీ స్పీకర్ కోడెల కుటుంబ సభ్యులు నియోజక వర్గంలో చేసిన అవినీతి రోజురోజుకు బయటపడుతోందని, ఇది అగ్రీగోల్డ్ అవినీతిలా తోస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. స్పీకర్ గా ఉన్న కోడెల శివప్రసాద రావు శాసన సభ రద్దుకాక ముందే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంద్రుడు.. చంద్రుడు అని పొగడడం, తెలుగుదేశం పార్టీకి ఇన్ని స్దానాలు వస్తాయంటూ చెప్పడం, అధికారం తెలుగుదేశం పార్టీదే అని ప్రకటన చేయడం ఎంత మాత్రం సబబు కాదన్నారు.

“శాసనసభ రద్దు కానంత వరకూ స్పీకర్ అన్ని పార్టీలకు చెందిన వ్యక్తి. అలాంటి వారు అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడడం నాకు ఆశ్చర్యమే కాదు… బాధ కూడా కలిగింది” అని క్రిష్ణారావు వ్యాఖ్యానించారు.

చర్చాగోష్ఠిలో పాల్గొన్న కోడెల శివప్రసాద్ భాదితుడు, రియల్టర్ వంశీ కూడా కోడెలపై తీవ్ర ఆరోపణలు చేసారు. కోడెల నియోజకవర్గంలో కే టాక్స్… కోడెల పన్ను చెల్లించకుండా ఎలాంటి వ్యాపారాలు చేపట్టలేకపోయామని ఆయన అన్నారు.

“డబ్బులు ఇవ్వడం, వాటిని పోగొట్టుకోవడం పెద్ద విషయం కాదు. గడచిన నాలుగున్నార ఏళ్లుగా కంటి మీద కునుకు లేకుండా గడిపాం. అదే పెద్ద విషాదం” అని వంశీ అవేదన వ్యక్తం చేసారు.

మాజీ స్పీకర్ కోడెల కుటుంబం చేసిన అక్రమాలపై పుట్ట పగిలి చీమలు వచ్చినట్లుగా బాధితులు వస్తున్నారని ఆయన చెప్పారు.