మిస్సింగ్… మిస్సింగ్…

అమ్మాయిల మిస్సింగ్ కేసులు తెలంగాణలో రోజు రోజుకి దడ పుట్టిస్తున్నాయి. గత వారం రోజులుగా దాదాపు 50 మంది దాక రాష్ట్రంలో అదృశ్యమైనట్లు పోలీసులు చెబుతున్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకు చెందిన స్రవంతి(17), గాయత్రి (17) కనిపించటం లేదని వారి తల్లితండ్రులు చెబుతున్నారు. మంగళవారం నాడు కాలేజీకి వెడుతున్నామని చెప్పి బయలుదేరిన ఈ ఇద్దరు రెండు రోజులుగా కనిపించకుండా పోయారు, ఆ తర్వాత వారి కోసం వెతికినప్పటికీ వారి ఆచూకి లభించకపోవడంతో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

ఇది ఇలా ఉండగా గడచిన నాలుగైదు రోజులుగా దాదాపు 50 మంది కనిపించకుండా పోవడంతో ఆందోళన కలిగిస్తోంది. ఇలా కనిపించకుండా పోయిన వారిలో మహిళలు, యువత ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ నెల 7వ తేదీన దాదాపు 82 మంది కనిపించడం లేదని వివిధ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

నగర శివార్లలోనే కాకుండా హైదరాబాద్ సిటీ నుంచి కూడా పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారం తామూ ఒక సవాలుగా తీసుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేసామని పోలీసులు అంటున్నారు.

సైబారాబాద్ కమీషనరేట్ పరిధిలో 19 మంది, రాచకొండలో 10 మంది, జీడిమెట్లలో 4 కనిపించడం లేదని తమకు ఫిర్యాదులు అందినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే వీరంతా కూడా తామంతట తామే వెళ్లిపోయారా లేదా ఎవరైనా కిడ్నాప్ చేసారా అన్నది తెలియటంలేదు.

ఏదిఏమైనప్పటికీ రాష్ట్రంలో అదృశ్యకేసులు నగర వాసులను బెంబేలు పెట్టిస్తున్నాయి. తమవారు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో తెలియక తప్పిపోయిన వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, తప్పిపోయిన వారి ఆచూకి అతి త్వరలో తెలియచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అయితే పోలీసులు మాత్రం ఇంతమంది తప్పిపోవడం నిజం కాదని…. ఎవరో కావాలని వదంతులు ప్రచారం చేస్తున్నారని, సోషల్‌ మీడియా వేదికగా దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు.