Telugu Global
Cinema & Entertainment

'వజ్రకవచధర గోవింద' సినిమా రివ్యూ

రివ్యూ: వజ్రకవచధర గోవింద రేటింగ్‌: 1/5 తారాగణం: సప్తగిరి, వైభవీ జోషీ, అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్ తదితరులు సంగీతం: విజయ్ బుల్గానిన్ నిర్మాత: శివ శివమ్ ఫిలిమ్స్ దర్శకత్వం: అరుణ్ పవార్ కొన్ని సినిమాలకు నిర్మాతలు ఎలా దొరుకుతారో అర్థంకాదు, కథపై నమ్మకంతో అంత డబ్బు ఎలా పెడతారో అస్సలు అర్థంకాదు. అసలు ఇలాంటి సినిమాలు హిట్ అవుతాయని ఎలా అనుకుంటారో బొత్తిగా అర్థంకాదు. సరిగ్గా ఈ కోవకు చెందిన సినిమానే వజ్రకవచధర గోవింద. […]

వజ్రకవచధర గోవింద సినిమా రివ్యూ
X

రివ్యూ: వజ్రకవచధర గోవింద
రేటింగ్‌: 1/5
తారాగణం: సప్తగిరి, వైభవీ జోషీ, అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్ తదితరులు
సంగీతం: విజయ్ బుల్గానిన్
నిర్మాత: శివ శివమ్ ఫిలిమ్స్
దర్శకత్వం: అరుణ్ పవార్

కొన్ని సినిమాలకు నిర్మాతలు ఎలా దొరుకుతారో అర్థంకాదు, కథపై నమ్మకంతో అంత డబ్బు ఎలా పెడతారో అస్సలు అర్థంకాదు. అసలు ఇలాంటి సినిమాలు హిట్ అవుతాయని ఎలా అనుకుంటారో బొత్తిగా అర్థంకాదు. సరిగ్గా ఈ కోవకు చెందిన సినిమానే వజ్రకవచధర గోవింద. సప్తగిరి హీరోగా నటించిన ఈ సినిమా సగటు సినిమాకు తక్కువ, జబర్దస్త్ కు ఎక్కువగా ఉంది. అలా అని జబర్దస్త్ రేంజ్ లో కూడా నవ్వించదు.

తన గ్రామంలో అంతా క్యాన్సర్ తో చనిపోవడం చూసి తట్టుకోలేకపోతాడు గోవింద్ (సప్తగిరి). ఎలాగైనా వాళ్లను కాపాడాలనుకుంటాడు. వాళ్ల సమస్యను బలహీనతగా మార్చి ఎమ్మెల్యేగా గెలుస్తుంది మానస (అర్చన అలియాస్ వేద). కానీ ఊరికి ఏమీ చేయదు. అదే టైమ్ లో గోవింద్ కు భారీ ఆఫర్ వస్తుంది. ఓ నిధిని కనిబెడితే 10 కోట్లు ఇస్తామని ఓ బ్యాచ్ వస్తుంది. గ్రామం కోసం నిధిని కనిబెట్టే పనికి ఒప్పుకుంటాడు. ఓ బాబా గెటప్ లో పరశురామ క్షేత్రానికి వెళ్తాడు. కానీ నిధి బదులు ఓ వజ్రం కనిబెడతాడు. అదే టైమ్ లో విలన్లు ఎంట్రీ అవుతారు. అంతకంటే ముందు హీరోయిన్ కూడా ఎంట్రీ అవుతుంది. ఫైనల్ గా వజ్రం ఎవరికి దక్కింది? గోవింద్ తను అనుకున్నది సాధించాడా లేదా అనేది స్టోరీ.

ఇప్పుడు మనం చెప్పుకున్న కథను యాజ్ ఇటీజ్ గా చిన్న ట్విస్టులు పెట్టి తీస్తే ఓ మోస్తరుగానైనా ఆడేది. కానీ దర్శకుడు అరుణ్ పవార్, జనాలకు ట్విస్ట్ ఇద్దామనుకున్నాడు. సెకండాఫ్ లో హీరోను గజినీని చేస్తాడు. ఓ పిచ్చి మొక్క తిని హీరో వజ్రం పెట్టిన చోటు మరిచిపోతాడన్నమాట. ఈమాత్రం దానికే తననుతాను హాలీవుడ్ రేంజ్ లో ఊహించుకున్నాడేమో…ఈ అంశం చుట్టూనే సెకెండాఫ్ మొత్తాన్ని నడిపించాడు దర్శకుడు. ఈ చిత్రహింస చాలదన్నట్టు మధ్యలో జబర్దస్త్ బ్యాచ్ ను కూడా దించాడు. ఇలా అంతా కలిసి ప్రేక్షకుల నవరంధ్రాల్లో సూదులు గుచ్చారు.

తను కమెడియన్ అనే ఫీలింగ్ సప్తగిరి మైండ్ లో అణువు కూడా ఉన్నట్టు లేదు. మహేష్ బాబు, బాలకృష్ణ సినిమాల్లో ఉన్నంత మాస్ ఇందులో ఉంది. వాళ్లకు కూడా లేనంత హీరోయిజం ఈ “హీరో”కు పెట్టేశారు. కామెడీ కోసం వచ్చిన ప్రేక్షకులు ఈ ఎలివేషన్స్ చూసి కంగుతినడం ఖాయం. తనకు ఇలాంటి బ్లాక్స్ కావాలని డైరక్టర్ ను సప్తగిరి బాగా బ్రెయిన్ వాష్ చేసినట్టున్నాడు. ఆ అతి మొత్తం తెరపై వికృతంగా పరుచుకుంది. సహనానికి సిసలైన పరీక్షగా నిలుస్తుంది. దీనికితోడు కామెడీ బ్యాచ్ మొత్తం వేసే బూతు జోకులు వింటుంటే, వీటి కోసమా థియేటర్ కు వచ్చాం అనిపిస్తుంది.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు సప్తగిరి తనలోని హీరోను పూర్తిస్థాయిలో తెరపై బయటపెట్టాడు. ఫైట్ చేసినా, డాన్స్ చేసినా, కూర్చున్నా, నిల్చున్నా తనను తను హీరోగా ఫీల్ అయి చేశాడు. చివరికి హీరో కాలితో తన్నినా కూడా హీరోలా ప్రవర్తిస్తాడు తప్ప బాధగా ఫీల్ అవ్వడు. హీరోగా ఓ వెలుగువెలగాలనే కాంక్ష సప్తగిరి మనసులో ఎంత బలంగా ఉందో ఈ సినిమా చూస్తే అర్థమౌతుంది.

అయితే ఆ కోరికను తీర్చుకునే విధానం మాత్రం ఇది కాదని థియేటర్ లో లేచి గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది ఈ సినిమా చూసిన వారికి. హీరోగానే కొనసాగాలనుకుంటే కంటెంట్ ఉన్న కథల్ని సెలక్ట్ చేసుకోవాలి. కామెడీనే చేయాలనుకుంటే ఈ హీరో వేషాలు మానేయాలి. రెండూ చేద్దామనుకుంటే మాత్రం రెండు పడవలపై కాలేసినట్టే. “వజ్రకవచం”తో ప్రేక్షకుల తలపై బలంగా మోదినట్టే.

హీరోయిన్ వైభవీ జోషికి అసలు అలాంటి పాత్ర ఎందుకిచ్చారో అర్థంకాదు. అసలు ఈ సినిమాకు హీరోయిన్ ఎందుకనేది ప్రాధమిక ప్రశ్న. హీరో ఉన్నాడు కాబట్టి హీరోయిన్ ఉండాల్సిందే అని పట్టుబట్టి మరీ ఆమెను పెట్టినట్టున్నారు. తెరపై ఆమె ఏమాత్రం ఉపయోగపడలేదు. విలన్ తంబిదొరై గంభీరంగా కనిపించాడు కానీ విలన్ గా అతడ్ని కూడా ఉపయోగించుకోలేకపోయారు.

టెక్నికల్ గా కూడా ఈ సినిమా సహనానికి పరీక్షే. విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసిన పాటలు వస్తుంటే ప్రేక్షకులంతా మొబైల్ ఫోన్లు బయటకు తీస్తున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్ లు చూసుకుంటున్నారు. ఇక రీ-రికార్డింగ్ మరో ఎత్తు. సన్నివేశానికి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు సంబంధంలేని విధంగా ఉన్నాయి కొన్ని సీన్లు. ఓ పెద్ద హీరోను ఊహించుకొని, కేజీఎఫ్ రేంజ్ లో సినిమా తీయాలనే ఆరాటంతో మహేంద్ర ఈ కథ రాసుకొని ఉంటాడు. కానీ సప్తగిరి రాకతో అతడి కోసం కామెడీ పెట్టాలనే ఉద్దేశంతో సెకండాఫ్ ను పూర్తిగా మార్చేసి దీన్ని కిచిడీ చేశారు.

ఓవరాల్ గా వజ్రకవచధర గోవింద సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు.

First Published:  14 Jun 2019 5:32 AM GMT
Next Story