షూటింగ్ సెట్ లో గాయపడ్డ నాగ శౌర్య

యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం తన హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ పతాకంపై మూడవ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా షూటింగ్ తాజాగా అరిలోవ, విశాఖపట్నం లో జరుగుతోంది. అక్కడ 11రోజుల పాటు సాగాల్సిన షూటింగ్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది.

కానీ ఒక సన్నివేశం షూటింగ్ అప్పుడు నాగశౌర్య తీవ్రంగా గాయపడ్డాడు. ‘కే జి ఎఫ్’ ఫేమ్ అంబరీవ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేస్తున్న యాక్షన్ సన్నివేశాలలో నాగశౌర్య డూప్ లేకుండా స్వయంగా చేస్తున్నాడు. ఒక సన్నివేశంలో ఎలాంటి తాడు సహాయం కూడా లేకుండా నాగశౌర్య 15 అడుగులు ఎత్తున బిల్డింగ్ నుంచి కిందకు దూకాలి.

ఫైట్ మాస్టర్లు ఈ సన్నివేశం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనుకోకుండా నాగశౌర్య బిల్డింగ్ మీద నుంచి పడి పోయేటప్పుడు మోకాలు దెబ్బతింది. వెంటనే నాగ శౌర్య ను దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్ కు తరలించింది ఈ చిత్ర బృందం.

ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్లు నాగ శౌర్య కి 25 నుంచి 30 రోజుల వరకు పూర్తి గా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. షూటింగ్ మొదలు పెట్టిన నాలుగో రోజే ఇలా జరిగింది. ప్రస్తుతం చిత్ర బృందం తిరిగి హైదరాబాద్ కి రాబోతోంది. మరొక నాలుగు లేదా ఐదు వారాల తర్వాత సినిమా షూటింగ్ మళ్లీ మొదలు కానుంది.