మోడీ నిర్ణయంతో పెరగనున్న విమాన చార్జీలు

ఇండియా, పాకిస్తాన్ మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్తత నెలకొని ఉంది. ప్రస్తుతం మన ఇండియా నుంచి వెళ్లే ప్రతీ విమానం కూడా కేవలం పాకిస్తాన్ తెరిచిన ఒకే ఒక మార్గం ద్వారా వెళ్తున్నాయి. అయితే భారత ప్రధాని తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సాధారణ ప్రయాణికులకు పెను భారాన్ని తీసుకొని రానుంది.

కిర్గిస్థాన్‌లో జరిగిన ‘షాంఘై కోపరేషన్‌ ఆర్గనైజేషన్‌’ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు పాకిస్తాన్‌ గగనతలం నుంచి కాకుండా ఓమన్‌ గగనతలం మీదుగా వెళ్లారు. పాకిస్తాన్ మా గగనతలాన్ని వాడుకోమని అనుమతించినా ప్రధాని మోడీ మాత్రం వాడుకోలేదు. ఇప్పటికే సాధారణ కమర్షియల్ విమానాలకు… పాకిస్తాన్ గగనతలం వాడుకోవడానికి జూన్ 28 వరకు నిషేధం ఉంది.

పాకిస్తాన్ గగనతలంపై నిషేధం ఉండటంతో ఇండియా నుంచి గల్ఫ్, టర్కీ, యూరప్, యూఎస్ఏ వెళ్లే వారికి రెండు గంటల అదనపు సమయం పడుతోంది. అంతే కాకుండా చార్జీ కూడా పెరిగిపోతోంది.

ఇదే విషయంపై ‘ఏర్‌ ప్యాసింజర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ అధ్యక్షులు సుధాకర్‌ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లాలంటే అరగంట, యూరప్‌ దేశాలకు వెళ్లాలంటే రెండు గంటలు ఎక్కువ సమయం పడుతోందని ఆయన చెప్పారు. సాధ్యమైనంత త్వరగా గగనతలం ఆంక్షలను పాకిస్తాన్‌ ఎత్తివేసేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.