పదవులు కాదు… మాకు ప్రత్యేక హోదానే ముఖ్యం

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు పదవులు ముఖ్యం కాదని… ప్రత్యేక హోదానే ముఖ్యం అని చెప్పారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి.

రేపటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలో ఈరోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. మోడీ వరుసగా రెండోసారి ప్రధాని అయిన తర్వాత జరిగిన తొలి సమావేశం ఇదే.

ఈ సమావేశానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి హజరయ్యారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు విజయసాయిరెడ్డి. విభజన హామీలు అమలు చేయాలని ఈ సమావేశంలో కోరామని చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని, బీసీ సంక్షేమానికి పెద్ద పీట వేయాలని ఈ అఖిలపక్ష సమావేశంలో డిమాండ్‌ చేశామన్నారు. వీటితో పాటు మహిళా రిజర్వేషన్‌ బిల్లును కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామన్నారు.

వెనుకబడిన వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేయాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్‌ కల్పించాలని మా పార్టీ తరపున డిమాండ్‌ చేశాం… ఈ విషయంలో గతంలోనే రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును కూడా ప్రవేశపెట్టాం. అవసరమైతే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌ను సవరించాలని కోరాం.

పార్లమెంట్‌ సజావుగా జరిగేలా చట్టం తేవాలని, సమావేశాలను అడ్డుకునే పార్లమెంట్‌ సభ్యులపై చర్యలు తీసుకుని, వారికి రావాల్సిన జీతభత్యాలలో కోత విధించాలని మా పార్టీ తరపున సూచన చేశాం.

వైసీపీ లేవనెత్తిన ఈ అంశాలకు ఇతర పార్టీలు కూడా మద్దతు తెలిపాయని విజయసాయి రెడ్డి చెప్పారు.

డిప్యూటీ స్పీకర్‌ పదవిలో వైసీపీ అభ్యర్ధిని నియమించబోతున్నారని వార్తలు వస్తున్నాయని విలేకరులు అడగడంతో దానికి స్పందించిన విజయసాయిరెడ్డి….. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవిపై మాకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని…. తమ నేత వైఎస్‌ జగన్‌ ఈ విషయం పై స్పష్టమైన వివరణ కూడా ఇచ్చారని గుర్తుచేశారు. మీ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తుందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానం ఇస్తూ…. దేశానికి, ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే అంశాలపై తప్పకుండా మద్దతిస్తామని చెప్పారు.

అనంతరం లోక్‌సభ వైసీపీ పక్షనేత ఎంపీ మిథున్‌ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను నెరవేర్చాలని మరోసారి అఖిలపక్షంలో అడిగామన్నారు.