సీఎంగా జగన్ పాలన బాగుంది…. సినీ నటుడు సుమన్

ఆంధ్ర ప్రదేశ్ లో నూతనంగా అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందని ఒకప్పటి సినీ హీరో, నేటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుమన్ కితాబునిచ్చారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వచ్చిన సుమన్ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడచిన పది రోజులుగా తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు మైనారిటీలకు, మహిళలకు, కాపు కులస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి చారిత్రక నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, ఇతర రాష్ట్రాల వారికి ఇది ఆదర్శనీయమని సినీ నటుడు సుమన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో తాను ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదని, భవిష్యత్తులో చూస్తాననే నమ్మకం కూడా లేదని సుమన్ వ్యాఖ్యానించారు.

మంత్రివర్గ కూర్పుతో పాటు గడచిన పదిరోజులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నాయని సుమన్ అన్నారు.

జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందనే నమ్మకం కలుగుతోందని సుమన్ వ్యాఖ్యానించారు. తాను త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కలుసుకుని అభినందనలు తెలుపుతానని చెప్పారు.

తనకు రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి లేకపోయినా… ప్రజలకు మేలు చేసే వారి పట్ల ఎంతో గౌరవం ఉందని సుమన్ తెలిపారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉందని, ఇక ముందు ఆ సమస్యల నుంచి బయటపడతారనే నమ్మకం కలుగుతోందని సుమన్ అభిప్రాయపడ్డారు.