పాతబస్తీలో డిస్కోరాజా

మొన్నటివరకు ఈ సినిమాపై అనుమానాలు చెలరేగాయి. కానీ ప్రస్తుతం ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్. రవితేజ నటిస్తున్న డిస్కోరాజా సినిమా షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. మొన్నటికిమొన్న రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమాకు సంబంధించి రవితేజ, వెన్నెల కిషోర్ మధ్య కొన్ని సన్నివేశాలు తీశారు. ఆ వెంటనే హైదరాబాద్ పాతబస్తీకి యూనిట్ షిఫ్ట్ అయింది. అక్కడ కేవలం రవితేజపై కొన్ని మాంటేజ్ సన్నివేశాలు తీశారు.

త్వరలోనే హైదరాబాద్ లోనే మరో భారీ సెట్ వేసి, దాదాపు 20 రోజుల భారీ షెడ్యూల్ ను అందులో పూర్తిచేయాలని నిర్ణయించారు. ఈ సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. పాయల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తిచేయాలని భావిస్తున్నాడు రవితేజ. ఎందుకంటే, గోపీచంద్ మలినేని స్టోరీకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరోవైపు ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న శృతిహాసన్ కూడా కాల్షీట్లు తక్కువగా కేటాయించిందట. అందుకే ఆ సినిమాను దృష్టిలో పెట్టుకొని, డిస్కోరాజా సినిమా షూటింగ్ ను పరుగులుపెట్టిస్తున్నాడు మాస్ రాజా.