నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు..!

పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి.

సోమవారం ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు జులై 26 వ తారీఖు వరకు కొనసాగుతాయి. పార్లమెంటు సమావేశానికి ముందు రోజు ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలకు చెందిన సభ్యులతో సమావేశం నిర్వహించారు.

పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగాలని, అందుకు సభ్యులు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. సోమవారం నాడు ప్రారంభమైన సమావేశాలలో తొలి రెండు రోజులు పార్లమెంటుకు ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈసారి లోక్ సభలో సీనియర్ సభ్యులతో పాటు కొత్తగా ఎన్నికైన వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉండటం విశేషం.

రెండు రోజులపాటు లోక్ సభ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఈనెల 19వ తేదీన నూతన స్పీకర్ ను ఎన్నుకుంటారు. అనంతరం 20వ తేదీన లోక్ సభ, రాజ్యసభ సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఈ సమావేశాలలో కొన్ని కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది.

గత పార్లమంట్ లో పెండింగ్ లో ఉన్న కీలక బిల్లులకు ఈ లోక్ సభ సమావేశాలలో ఆమోద ముద్ర పడే అవకాశం ఉందని చెబుతున్నారు. వచ్చే నెల 5వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడతారు.

తెలుగు రాష్ట్రాల నుంచి లోక్ సభకు ఎన్నికైన సభ్యులు ఆయా రాష్ట్రాల సమస్యలపై లోక్ సభలో ప్రస్తావిస్తామని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే తమ తొలి ప్రాధాన్యమని, ఈ అంశంపై లోక్ సభలో గళం విప్పుతామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి చెప్పారు.

విభజన అనంతరం సమస్యలపై ప్రస్తావిస్తూనే ప్రత్యేక హోదాపై లోక్ సభలో ప్రశ్నిస్తామని ఆయన తెలిపారు.

ఇక లోక్ సభలో తెలుగుదేశం పార్టీ నాయకుడైన గల్లా జయదేవ్ మాట్లాడుతూ లోక్ సభ సమావేశాలు అన్ని ప్రాంతీయ భాషలలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణకు రావాల్సిన నిధులపై లోక్ సభలో ప్రస్తావిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు చెబుతున్నారు.