సాహో కి కొత్త సంగీత దర్శకుడు?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సాహో’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఓ పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

మొదట ఈ చిత్రానికి సంగీతం శంకర్-ఎహశాన్-లోయ్ అందించాల్సి ఉంది. కానీ వారు సినిమా నుంచి తప్పుకున్నట్లు స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. నిజానికి ‘సాహో’ రెండవ మేకింగ్ వీడియోకి మరియు ఈ మధ్యనే విడుదలైన టీజర్ కి కూడా సంగీతాన్ని అందించింది జిబ్రానే.

ఈ తమిళ మ్యూజిక్ దర్శకుడు అందించిన మ్యూజిక్ సాహో సినిమా పైన అంచనాలను రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించేందుకు జిబ్రాన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, అరుణ్ విజయ్, మందిరాబేడీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ని యు.వి.క్రియేషన్స్ మరియు టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.