అమెరికాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తెలుగు వారు దుర్మరణం

అమెరికాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దర్మరణం పాలయ్యారు. అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని వెస్ట్ డేస్ మోయిస్ లో నివసిస్తున్న సుంకర చంద్రశేఖర్ (44), సుంకర లావణ్య(41), ఇద్దరు చిన్నారులు తుపాకి కాల్పులలో మరణించారు.

సంఘటన స్దలంలో వీరి మృత దేహాలను చూసి భయంతో పారిపోయిన స్దానికుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. సుంకర చంద్రశేఖర్…. కుటుంబ సభ్యులను తుపాకితో కాల్చి అనంతరం తనను తాను కాల్చుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.

గత మార్చి నెలలో అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని వెస్ట్ డేస్ మోయిస్ లో ఓ ఇంటిని సుంకర లావణ్య కొనుగోలు చేసినట్లుగా పోలీసులకు ఆధారాలు దొరికాయి. ఆర్దిక ఇబ్బందుల కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

గత కొంతకాలంగా కుటుంబ యజమాని సుంకర చంద్రశేఖర్ మానసికంగా సరిగా లేరని, దీనికి తోడు కుటుంబ కలహాలు కూడా ఎక్కువయ్యాయని స్దానికులు చెబుతున్నారు. ఈ సంఘటనపై స్దానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

“ఈ సంఘటన ఎలా జరిగింది? దీనికి గల కారణాలపై విచారణ ప్రారంభించాం…. త్వరలో విచారణ వివరాలను వెల్లడిస్తాం.” అని స్దానిక పోలీసులు తెలిపారు. వీరి మరణాలను అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారుగా ప్రాధమిక దర్యాప్తులో తేలింది.