ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరుపై…. వర్మ సెటైర్లు

వైసీపీతో సాన్నిహిత్యం నెరుపుతున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. సమయం దొరికితే వైసీపీ ఎమ్మెల్యేల తీరును కూడా ఎండగట్టేందుకు వెనుకాడడం లేదు.

తాజాగా ఆయన ట్విట్టర్ లో ఏపీ అసెంబ్లీ తీరు అందులో స్పీకర్, వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు పట్ల సెటైర్ల వర్షం కురిపించారు. వర్మ వైసీపీ ఎమ్మెల్యేలు, స్పీకర్ పై వేసిన పంచులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి..

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై దుమ్మెత్తిపోయడమే అజెండాగా వైసీపీ ముందుకెళ్తోంది. సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు.. బాబు ప్రభుత్వం చేసిన అవినీతి, పనుల్లో లోపాలపై సాక్ష్యాలతో ఎత్తిచూపుతూ ఎండగడుతున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల ఆగ్రహావేశాలను కంట్రోల్ చేయడానికి స్పీకర్ తమ్మినేని సీతారాం పదే పదే బెల్ ను ఉపయోగిస్తూ మోత మోగిస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూసిన వారికే స్పీకర్ తమ్మినేని పదే పదే మోగించే బెల్ సౌండే ఎక్కువగా వినిపిస్తోంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం టీడీపీపై మాటల దాడిని ఆపడం లేదు.

అయితే ఈ పరిణామాలపై స్పందించిన వర్మ తాజాగా ట్విట్టర్ లో ఏపీ అసెంబ్లీని చూస్తుంటే తనకు స్కూలు గుర్తుకువస్తుందని సెటైర్ వేశారు. స్పీకర్ తమ్మినేని బెల్ మోగిస్తుంటే హెడ్ మాస్టర్ లా.. గోల చేస్తున్న ఎమ్మెల్యేలు స్కూలు పిల్లల్లా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును తిట్టడం మాని భవిష్యత్ లో ఏం చేస్తారు.? ప్రస్తుత సమస్యల పై చర్చించాలని వర్మ సూటిగా దెప్పిపొడిచారు.