పోలవరంలో అంతులేని అవినీతి – పర్యాటక మంత్రి అవంతి

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి జరిగిందని, ఈ విషయాన్ని స్వయంగా కాగ్ తన నివేదికలో పేర్కొందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.

మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఇటీవల మరణించిన మాజీ శాసన సభ్యులకు సభ నివాళులు అర్పించింది. అనంతరం గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాలు తెలిపే అంశంపై మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడారు. తన ప్రసంగంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు అవంతి శ్రీనివాస్.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీనియర్ అని తాను విశ్వసించానని, అయితే ఆయన ఒంటెత్తు పోకడలకు పోయారని చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి అనేక సూచనలు చేసే వాడినని, అయితే వాటిని చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని మంత్రి అన్నారు.

వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులను ధన యజ్ఞం ప్రాజెక్టులంటూ తెలుగుదేశం నాయకులు ఎద్దేవా చేసారని అన్నారు. “ధన యజ్ఞం అన్నవారే పోలవరం ప్రాజెక్టు పనులలో తీవ్ర అవినీతికి పాల్పడ్డారు” అని మంత్రి ఘాటుగా విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై నిగ్గు తేల్చేందుకు నియమించిన కమిటీ త్వరలోనే తన నివేదిక ఇస్తుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అవినీతి కారణంగానే ఆ పార్టీ దారుణంగా ఓడిపోయిందని, ఇప్పటికైనా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మపరిశీలన చేసుకోవాలని అవంతి శ్రీనివాస్ సూచించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెడుతున్న నవరత్నాలను చంద్రబాబు నాయుడు కాపీ కొట్టారని, తెలుగుదేశం మెనిఫెస్టోలో కూడా వాటినే పొందుపరిచారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం గొప్ప కార్యక్రమమన్నారు.

“అమ్మఒడి కార్యక్రమం ఎంతో గొప్ప నిర్ణయం. ఇలాంటి పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభినందనీయులు” అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.