జబర్దస్త్ చలాకీ చంటి కారును ఢీకొట్టిన లారీ…. తృటిలో తప్పిన ప్రమాదం

ప్రఖ్యాత కమెడియన్, జబర్ధస్త్ టీం లీడర్ చలాకీ చంటి ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో చంటికి గాయాలయ్యాయి.

ఈ ఉదయం ఆరున్నర గంటలకు చలాకీ చంటి విజయవాడలో పని ముగించుకొని హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. చలాకీ చంటి కోదాడ నుంచి హైవేపై వెళ్తుండగా.. కోమరబండ వద్ద  ఓ లారీ చంటి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంటికి గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘోర రోడ్డు ప్రమాదాన్ని చంటి తృటిలో తప్పించుకున్నట్టు అయ్యింది.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని చలాకీ చంటిని ఆస్పత్రికి తరలించారు. ఆయన ప్రాణాలకు ఏమీ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

కాగా బుల్లితెరపై నవ్వులు పూయించే చలాకీ చంటికి యాక్సిడెంట్ అనగానే తోటి జబర్ధస్త్ కమెడియన్స్, జడ్జీ నాగబాబు ఆరా తీసినట్టు తెలిసింది. చంటికి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.