కోపా అమెరికాకప్ లో తొలి సంచలనం

  • అర్జెంటీనాకు కొలంబియా డబుల్ కిక్ 
  • ఈక్వెడోర్ పై ఉరుగ్వే విజయం
  • పరాగ్వేను నిలువరించిన ఖతర్

సాకర్ గడ్డ బ్రెజిల్ వేదికగా జరుగుతున్న లాటిన్ అమెరికా సాకర్ సంరంభం కోపా అమెరికాకప్ గ్రూప్ -బీ లీగ్ లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది.

సాల్వెడోర్ వేదికగా ముగిసిన తొలిరౌండ్ పోటీలో కొలంబియా 2-0 గోల్స్ తో హాట్ ఫేవరెట్, మాజీ చాంపియన్ అర్జెంటీనాను కంగు తినిపించింది.

లయనల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయింది. కొలంబియా ఆటగాళ్లలో రోజర్ మార్టినెజ్, దువాన్ జపాటా చెరో గోల్ సాధించారు.

ఈక్వెడార్ కు ఉరుగ్వే కిక్…

బెలో హారిజాంటీ సాకర్ స్టేడియం వేదికగా ముగిసిన గ్రూప్- సీ తొలిరౌండ్ పోటీలో మాజీ చాంపియన్ ఉరుగ్వే 4-0 గోల్స్ తో ఈక్వెడార్ ను చిత్తు చేసింది.

ఏకపక్షంగా సాగిన పోటీ ఆరో నిముషంలోనే ఉరుగ్వే ఆటగాడు నికోలస్ తమజట్టు కు తొలిగోల్ అందించాడు. ఆ తర్వాత… కావానీ, సారేజ్ చెరో గోల్ సాధించడం ద్వారా తమజట్టు ఆధిక్యాన్ని 3-0కు పెంచారు. ఆట రెండో భాగంలో … ఈక్వెడార్ ఆటగాడు ఆర్థర్ మినా సెల్ఫ్ గోల్ సాధించడంతో.. 4-0 గోల్స్ తో ఉరుగ్వే విజయం పూర్తయ్యింది.

ఖతర్ 2- పరాగ్వే 2

రియో డి జెనీరో వేదికగా జరిగిన గ్రూప్ -డీ తొలిరౌండ్ పోటీలో…పరాగ్వేను ఆసియా చాంపియన్ ఖతర్ 2-2 గోల్స్ తో నిలువరించి…మ్యాచ్ ను డ్రాగా ముగించింది.

ఆట మొదటి భాగంలో ఆస్కార్ కార్డోజా, డెనిస్ గొంజాలేజ్ చెరో గోల్ సాధించడంతో పరాగ్వే 2-0 గోల్స్ తో పైచేయి సాధించింది.
అయితే ..ఆట రెండో భాగం నుంచి ఖతర్ జట్టు సర్వశక్తులూ కూడదీసుకొని చెలరేగి ఆడింది.

ఆట ఆఖరి భాగంలో అల్మోజ్ అలీ, బోలెమ్ కోకీ చెరో గోల్ చేసి…మ్యాచ్ ను 2- 2 గోల్స్ తో డ్రాగా ముగించడంలో ప్రధానపాత్ర వహించారు.