Telugu Global
NEWS

మాకు ప్యాకేజీ వద్దు.... హోదానే కావాలి " అసెంబ్లీలో జగన్

ఏపీ ప్రత్యేక హోదాపై గత ఐదేళ్లుగా ఒకే మాట మీద ఉన్న వైఎస్ జగన్.. సీఎం అయిన తర్వాత కూడా మాట మార్చలేదు. ఇప్పుడు ఏకంగా ఏపీ అసెంబ్లీలో మాకు హోదానే కావాలి…. కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజి వద్దంటూ ప్రకటించారు. అంతే కాకుండా ఆ మేరకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రసంగించిన జగన్ పలు విషయాలు వివరించారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల మనకు ప్రత్యేక హోదా రాకుండా పోయింది…. అందుకే […]

మాకు ప్యాకేజీ వద్దు.... హోదానే కావాలి  అసెంబ్లీలో జగన్
X

ఏపీ ప్రత్యేక హోదాపై గత ఐదేళ్లుగా ఒకే మాట మీద ఉన్న వైఎస్ జగన్.. సీఎం అయిన తర్వాత కూడా మాట మార్చలేదు. ఇప్పుడు ఏకంగా ఏపీ అసెంబ్లీలో మాకు హోదానే కావాలి…. కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజి వద్దంటూ ప్రకటించారు. అంతే కాకుండా ఆ మేరకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రసంగించిన జగన్ పలు విషయాలు వివరించారు.

గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల మనకు ప్రత్యేక హోదా రాకుండా పోయింది…. అందుకే తాజాగా మాకు హోదానే కావాలి అని తీర్మానం చేసి పంపుతున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకపోగా.. ఆ అన్యాయం మరింత పెరగటానికి కారణమైందని ఆరోపించారు. అందుకే ఈ రోజు మనమంతా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సి వస్తోందన్నారు.

రాష్ట్ర విభజన వల్ల ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. విభజన తర్వాత మనకు ఎలాంటి రాజధాని లేకుండా ఉద్యోగాలను, ఆదాయాన్ని వదులుకున్నాం…. అంతే కాకుండా 47 శాతం అప్పులతో ప్రయాణం ప్రారంభించాం. ఎలాంటి మౌళిక వసతులు లేని వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయామని జగన్ చెప్పారు.

గతంలో 14వ ఆర్థిక సంఘం మనకు 22 వేల 113 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేసింది. కానీ వాస్తవానికి మనకు ఇప్పుడు 66 వేల 362 కోట్ల రెవెన్యూ లోటు ఉందని జగన్ వెల్లడించారు.

గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందుతూ ఒక ముఖ్యమైన ఆర్థిక నగరంగా ఆవిర్భవించింది. ఉమ్మడి ఏపీలో 2013-14లో 57వేల కోట్ల రూపాయల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు ఉండగా.. ఒక్క హైదరాబాద్ నుంచే 56,500 కోట్ల రూపాయల ఎగుమతులు జరిగాయని గుర్తు చేశారు.

ఇలా ఒక ముఖ్య ఆదాయాన్ని పోగొట్టుకోవడం వల్లే ఏపీ లోటు బడ్జెట్‌తో ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తుందన్నారు. ఈ పొరపాట్లను గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం సరిదిద్దక పోగా మరింత అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు.

విభజన సమయంలో 97 వేల కోట్లు ఉన్న రాష్ట్ర అప్పు…. 2018-19 నాటికి 2 లక్షల 58 వేల 928 కోట్ల రూపాయలకు పెరిగిపోయిందని…. దీనిపై వడ్డీనే 20 వేల కోట్లు కడుతున్నామని అన్నారు. ఇదే రిపోర్టును మొన్న నీతి ఆయోగ్‌లో ప్రధాని ఎదుట చదివి వినిపించానని…. విభజన నష్టాలను ప్రత్యేక హోదా ద్వారానే పూడ్చుకోవచ్చని జగన్ స్పష్టం చేశారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మరిన్ని పరిశ్రమలు వచ్చి, మౌళిక సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది. దీనికి పన్ను రాయితీలు రావాలంటే ప్రత్యేక హోదానే శరణ్యమని.. అందుకే ఐదు కోట్ల మంది ఆంధ్రుల తరపున ఈ హోదా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు జగన్ అసెంబ్లీలో ప్రకటించారు.

First Published:  18 Jun 2019 6:06 AM GMT
Next Story