హీరోగా…. వినాయక్ కష్టాలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచినప్పటికీ ఆ క్రెడిట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వి.వి.వినాయక్ ఖాతాలో మాత్రం పడలేదు.

ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ‘ఇంటెలిజెంట్’ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వం వహించబోయే తదుపరి సినిమాలో హీరో ఇతనే అంటూ బోలెడు పేర్లు బయటకు వచ్చాయి. కానీ అందులో ఒక్క సినిమా కూడా పట్టాలెక్కలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ దర్శకుడు ఇప్పుడు హీరోగా రాబోతున్నాడని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడట. ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయిపోయాయట. 

అయితే గతంతో పోలిస్తే వి.వి.వినాయక్ ఇప్పుడు కొంచెం బరువు పెరిగినట్లు తెలుస్తోంది. కావాలనే ఈ సినిమా కోసం పెరిగినట్లు సమాచారం. అయితే ఇదే లుక్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాక మరలా వినాయక్ బరువు తగ్గుతాడట. మిగిలిన సన్నివేశాల కోసం వినాయక్ సన్నగా కనిపించనున్నాడు అని టాక్. అందుకే ముందుగా లావుగా ఉన్నప్పటి సీన్లను చిత్రీకరించి…. కొంత గ్యాప్ తర్వాత బరువు తగ్గి…. షూటింగ్ పార్ట్ లో పాల్గొంటాడట వినాయక్.

దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వి.వి.వినాయక్ ఇప్పుడు హీరోగా ఏమాత్రం హిట్ అందుకుంటాడో చూడాలి.

ఒకవైపు రాహుల్ రవీంద్రన్ వంటి యువ హీరోలు డైరెక్టర్లు గా మారుతూ ఉంటే మరోవైపు వి.వి.వినాయక్ వంటి సీనియర్ దర్శకుడు హీరో అవతారం ఎత్తుతుండటం విశేషం.