మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై దొంగతనం కేసు

తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ పై పశ్చిమ గోదావరి జిల్లా రైతులు దొంగతనం కేసు పెట్టారు. పెదవేగి పోలీస్ స్టేషన్ లో తమ పైపులను ఎమ్మెల్యే చింతమనేని దొంగిలించి తమ ఇంటికి అక్రమంగా తరలించుకు పోయారని సత్యనారాయణ అనే రైతు కేసు పెట్టారు.

పోలవరం కుడి కాలువ జానంపేట వద్ద కొందరు రైతులు ఎకరానికి 1000 రూపాయల వంతున వేసుకుని కొన్ని పైపులను గతంలో కొనుగోలు చేసారు. ఈ పైపుల ద్వారానే వారి పొలాలకు సాగునీరు అందేది.

అయితే అధికారం కోల్పోయాననే అక్కసుతో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అర్ధరాత్రి పైపులను అక్రమంగా తరలించుకుపోయారని రైతులు కేసు పెట్టారు.

గతంలో రైతులకు చింతమనేనికి మధ్య పైపుల అంశంలో వివాదం చెలరేగింది. ఆ సమయంలో అధికారం అండ చూసుకుని రైతులపై చింతమనేని చెలరేగిపోయారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో…. సైలెంట్ గా అర్ధరాత్రి ఈ సాగునీటి పైపులను చింతమనేని అక్రమంగా తరలించుకుపోయారని రైతులు చెబుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభుకర్ పై 420, 384, 431 కింద కేసులు నమోదు చేసారు. దీంతో పాటు రెడ్ విత్ 34 సెక్షన్ క్రింద కూడా కేసు నమోదు అయ్యింది.

పోలీసులు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఉండగా చింతమనేని ప్రభాకర్ ఇసుక అక్రమ తరలింపుతో పాటు అధికారులపై చేయి చేసుకోవడం వంటి చర్యలు వివాదస్పదంగా మారాయి. అయితే అప్పట్లో ఆయన ఎమ్మెల్యేగా ఉండడం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో చింతమనేనికి వ్యతిరేకంగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు.