Telugu Global
National

మీరు ఖండించరా.... సీనియర్లపై చంద్రబాబు సీరియస్...!

తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించి అధికార భారతీయ జనతా పార్టీలో చేరడంపై తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు స్పందించడం లేదంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఎన్నికల అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకోసం విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ ఉండగానే నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో తమను విలీనం చేయాలంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ […]

మీరు ఖండించరా.... సీనియర్లపై చంద్రబాబు సీరియస్...!
X

తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించి అధికార భారతీయ జనతా పార్టీలో చేరడంపై తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు స్పందించడం లేదంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

ఎన్నికల అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకోసం విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ ఉండగానే నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో తమను విలీనం చేయాలంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ ఇచ్చారు. ఆ లేఖను రాజ్యసభ చైర్మన్ ఆమోదిస్తూ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుల విలీన కార్యక్రమాన్ని పూర్తి చేసారు.

నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ వీడడంతో షాక్ కు గురైన చంద్రబాబు నాయుడు విదేశం నుంచే పార్టీ సీనియర్ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ మారిన రాజ్యసభ సభ్యుల తీరుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తీవ్రంగా ఖండించాలని, ఏ జిల్లాకు చెందిన నాయకులు ఆ జిల్లాలో విలేకరుల సమావేశం పెట్టి రాజ్యసభ సభ్యుల తీరును ప్రశ్నించాలని చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ లో సూచించారు. అయితే ఈ సూచనను సీనియర్ నాయకులు ఎవరు పట్టించుకోలేదని, అధినేత సూచనను పెడచెవిన పెట్టారని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకులలో దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్, కాలువ శ్రీనివాస్, వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న మినహా మిగిలిన వారవరూ స్పందించలేదు. పార్టీలో సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కే.ఈ. ప్రభాకర్ వంటి నాయకులు పార్టీ మారిన రాజ్యసభ సభ్యులు విషయం తమకు తెలియదనట్లుగా ప్రవర్తించారు.

ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నాయకులందరికీ వ్యక్తిగతంగా ఫోన్లు చేసి “నలుగురు రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతే మీ నుంచి స్పందన ఉండదా?” అని ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. “రాజ్యసభ సభ్యుల చర్యను ఖండించారా..? లేకపోతే వాళ్ళ లాగా మీరూ వెళ్ళిపోతారా?” అని చంద్రబాబు నాయుడు కాస్త కటువుగానే ప్రశ్నించినట్లు సమాచారం.

ఎన్నికల ప్రచారంతో పాటు వ్యూహరచనలోనూ అలసిపోయిన తాను సేదతీరేందుకు విదేశీ పర్యటనకు వస్తే తనకు ఇక్కడ కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని పార్టీ నాయకుల పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉన్నా లేకపోయినా, తానొక్కడినే పోరాడతానని, పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చే వరకు తాను విశ్రమించనని చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్లు సమాచారం.

అయితే పార్టీ సీనియర్‌ నాయకులు మాత్రం వేరేవిధంగా అంటున్నారు. చంద్రబాబే టీడీపీ పార్టీ అని, టీడీపీ అంటేనే చంద్రబాబు అని…. ఆయన పార్టీ మూల విరాట్‌ అయితే తామంతా ఉత్సవ విగ్రహాలము మాత్రమే అని…. ఆయనకు తెలియకుండా ఇవన్నీ జరిగి ఉంటాయని తాము భావించడం లేదని…. జనం దగ్గర సానుభూతి కోసమే ఈ డ్రామాలన్నీ అని అంటున్నారు. వీళ్ళు ఇలా బీజేపీలోకి వెళతారని తెలిసే ఆయన ముఖం తప్పించి విదేశీ పర్యటనలకు వెళ్ళాడని అంటున్నారు.

ఒకవైపు సుజనా చౌదరి నేను చంద్రబాబుతో నిరంతరం టచ్‌లోనే ఉంటున్నాను… అని చెబుతున్నాక కూడా ఇంకా ఈ ఖండనల డ్రామాలు జనం ఎంత కాలం నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా పార్టీనుంచి వెళ్ళిపోతే వాళ్ళను చంద్రబాబు ఎంతగా విమర్శించేవాడో అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు మాత్రం ఈ నలుగురు ఎంపీలను చంద్రబాబు ఒక్క మాట అనకపోవడం…. ఎల్లో మీడియా కూడా వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తూ రాతలు రాయకపోవడం చూస్తే…. ఇంకా డౌటా…. చంద్రబాబుకు చెప్పకుండా పోయారా? అని అంటున్నారు.

ఒక వేళ నిజంగానే చంద్రబాబు అనుమతి లేకుండా వాళ్లు వెళ్ళి ఉంటే చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి, ఆ సామాజిక వర్గానికి గాడ్‌ ఫాదర్‌ లాంటి వెంకయ్య నాయుడు అయిన ఏదో ఒక సాకు చూపి…. వాళ్ళ విలీనానికి అడ్డుపుల్ల వేసేవాడు కదా…! అలాంటిదేమీ జరగలేదంటే అంతా స్క్రిప్ట్‌ ప్రకారమే జరుగుతుందని జనం కూడా నమ్ముతూ ఉంటే ఇక ఇప్పుడు ఈ ఖండనలు దేనికి? అని ప్రశ్నిస్తున్నారు.

First Published:  22 Jun 2019 12:26 AM GMT
Next Story