మళ్లీ జనసేన సమావేశాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఆదివారం నుంచి మళ్లీ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన జనసేన ఆ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.

ఆ ఎన్నికలలో ఎదురైన పరాభవాన్ని త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం ద్వారా భర్తీ చేయాలన్నది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచనగా పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఆదివారం నుంచి జరిగే ఈ సమీక్ష సమావేశాలలో నియోజకవర్గాల వారీగా నాయకులందరితోనూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. ఈ సమావేశాలు వారం, పది రోజుల పాటు జరుగుతాయని పార్టీ నాయకులు చెబుతున్నారు.

ప్రతి నియోజకవర్గంలోనూ ఎదురైన ఓటమిని సమీక్షించడంతో పాటు గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చలు జరుపుతారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను చెప్పాల్సిందిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరతారని పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు.

జనసేన పార్టీ సమీక్షా సమావేశాల్లో పార్టీ మారాలనుకుంటున్న వారిపై సుదీర్ఘంగా చర్చిస్తారని, అలాంటి వారితో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అవుతారని పార్టీ వర్గాలు చెప్పాయి.

జనసేనలో కొందరు నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరతారని, మరికొందరు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు నివేదికలు అందాయి.

ఈ నివేదికల ఆధారంగా ఆయా నాయకులతో పవన్ కళ్యాణ్ విడివిడిగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని చెబుతున్నారు. పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈ సమావేశాలలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అంటున్నారు.

ఆయన అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు వచ్చినా జనసేన ఏకైక ఎమ్మెల్యే మాత్రం దాన్ని ఖండించారు. “నేను వైయస్సార్ కాంగ్రెస్ లో చేరితే 151 మంది శాసనసభ్యుల తర్వాత నేను 152 మనిషిని అవుతా..! అదే నేను జనసేనలో ఉంటే నెంబర్ వన్ నేనే. అఖిలపక్ష సమావేశాలతో పాటు అసెంబ్లీలోని వివిధ కమిటీలలో నాకు ప్రాధాన్యం ఉంటుంది” అని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విలేకరులకు స్పష్టం చేశారు.

దీంతో పార్టీలో రాపాక వరప్రసాద్ కు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.