రాగల 24 గంటల్లో.. ఏం జరగబోతోంది?

కొన్ని సినిమాలు టైటిల్ నుంచే ఆసక్తి రేకెత్తిస్తాయి. అలాంటి సినిమానే రాగల 24 గంటల్లో. ఈ పదం చూడ్డానికి సాదాసీదాగా కనిపించొచ్చు. కానీ దీనికి చాలా శక్తి ఉంది. మరీ ముఖ్యంగా తుపాన్లు వచ్చే టైమ్ లో రేడియో, టీవీల్లో హెచ్చరికలు జారీచేసేముందు, ఈ పదాన్ని వాడుతుంటారు. చిన్నప్పట్నుంచి మనందరం ఈ పదాన్ని వింటూనే ఉన్నాం. అందుకే ఈ టైటిల్ పై అంత ఆసక్తి పెరిగింది.

శ్రీ నవహాస్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యదేవ్, ఈషా రెబ్బ, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో నటించారు. కేవలం కథను నమ్మి తీస్తున్న సినిమా ఇది. ఇందులో హీరోలు, హీరోయిన్లు అంటూ ప్రత్యేకంగా ఉండరు. ప్రతి పాత్ర ప్రత్యేకమే. అందుకే ఈ సినిమాపై ఓ మోస్తరుగా అంచనాలు పెరిగాయి.

హీరో శ్రీరామ్ ఇందులో ఓ ముఖ్యపాత్రలో కనిపించడం మరో అదనపు ఆకర్షణ. తాజాగా సినిమాకు సంబంధించి టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను త్వరగా పూర్తిచేసి, వచ్చేనెలలో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. రఘు కుంచె ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.