సిగరెట్ తాగడంపై క్లారిటీ ఇచ్చిన రామ్

చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్న ఇస్మార్ట్ శంకర్‌  సినిమా షూటింగ్ స్పాట్ లో రామ్ కు చేదు అనుభవం ఎదురైంది. బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగుతున్నాడనే కారణంతో పోలీసులు రామ్ కు జరిమానా విధించారు. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత యూనిట్ కు చెందిన వ్యక్తులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి 200 రూపాయల ఫైన్ కట్టి వచ్చారు. అయితే ఈ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

స్మోకర్ అంటూ ట్రోలింగ్ షురూ అవ్వడంతో రామ్ క్లారిటీ ఇవ్వక తప్పలేదు. తను సిగరెట్ తాగిన మాట వాస్తవమే అని ప్రకటించిన రామ్, ఫైన్ కట్టిన విషయాన్ని కూడా అంగీకరించాడు. కానీ వాస్తవానికి అక్కడ జరిగింది వేరు అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు.

“నా టైమ్, పబ్లిక్ టైమ్ వేస్ట్ చేయడం ఇష్టంలేక రెస్పాండ్ కాలేదు. షాట్ లో సిగరెట్ కాల్చాను. షూటింగ్ బ్రేక్ లో కాల్చలేదు. టైటిల్ సాంగ్ లో ఆ స్టెప్ ఉంటుంది. పైగా చట్టాన్ని గౌరవించి ఫైన్ కూడా కట్టేశాం. నాలాగే అందరూ ఈ విషయాన్ని లైట్ తీస్కొని పని చూస్కుంటే మంచిది.”

ఇలా ఓపెన్ గా ట్వీట్ పెట్టాడు రామ్. కేవలం షూటింగ్ లో భాగంగా సిగరెట్ తాగాను తప్ప, పబ్లిక్ గా తాగలేదని స్పష్టంచేశాడు. అయినప్పటికీ జరిమానా కట్టానని చెప్పాడు. రామ్ కు సిగరెట్ అలవాటు ఉందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే, అతడు జరిమానా కట్టాడనే విషయం మాత్రం తాజా ట్వీట్ తో నిర్థారణ అయింది.