Telugu Global
NEWS

చంద్రబాబు.. జగన్.. ఇద్దరిలో ఎంత వ్యత్యాసం...! " ఏపీ ఉన్నతాధికారులు

“ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలనను దగ్గరుండి చూశాం. గంటలు గంటలు సమావేశాలు నిర్వహించడమే తప్ప నిర్ణయాలు తీసుకున్నది లేదు” రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్య. “ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి నెల రోజులు కూడా కాలేదు. ఈ తక్కువ సమయంలోనే అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సమావేశాల పేరుతో అధికారులను ఇబ్బందుల పాలు చేయడం లేదు” ఆంధ్రప్రదేశ్ రాజధానిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఉత్తరాంధ్ర […]

చంద్రబాబు.. జగన్.. ఇద్దరిలో ఎంత వ్యత్యాసం...!  ఏపీ ఉన్నతాధికారులు
X

“ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలనను దగ్గరుండి చూశాం. గంటలు గంటలు సమావేశాలు నిర్వహించడమే తప్ప నిర్ణయాలు తీసుకున్నది లేదు” రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్య.

“ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి నెల రోజులు కూడా కాలేదు. ఈ తక్కువ సమయంలోనే అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సమావేశాల పేరుతో అధికారులను ఇబ్బందుల పాలు చేయడం లేదు” ఆంధ్రప్రదేశ్ రాజధానిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఓ కలెక్టర్ అభిప్రాయం.

కలెక్టర్ల సమావేశానికి వచ్చిన అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, చివరకు ఆయా శాఖల్లో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులు సైతం చంద్రబాబు నాయుడు పాలనతో జగన్మోహన్ రెడ్డి పాలనను అంచనా వేసి ఇద్దరికీ మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తనకు ఉద్యోగులపై కక్ష సాధించే ఉద్దేశ్యం లేదని, ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుగుణంగా అధికారులు పని చేస్తారనే విషయం తనకు తెలుసునని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

ఈ ప్రకటనపై ఉద్యోగులలో ఆనందం వెల్లివిరిసినా కొందరు ఉద్యోగుల్లో మాత్రం ఎక్కడో అనుమానపు పొగ కదలాడుతూనే ఉంది. కలెక్టర్ల సమావేశంలో ఆ అనుమానాలను కూడా పటాపంచలు చేశారు సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. పారదర్శకతే ప్రామాణికంగా పనిచేయాలని, ఎన్నికల వరకే ప్రజలు ఆ పార్టీకి, ఈ పార్టీకి చెందిన వారు అవుతారని, ఎన్నికలు ముగిసిన తర్వాత అందరూ ఒకటేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలో చేసిన ప్రకటనపై ఇరవై ముప్పై సంవత్సరాల సీనియారిటీ ఉన్న అధికారులు కూడా సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు.

“నేను నలుగురైదుగురు ముఖ్యమంత్రుల దగ్గర పని చేశాను. నిర్ణయాలు తీసుకోవడంలో గాని, అధికారులతో వ్యవహరిస్తున్న తీరులో గాని నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో పరిణితి కనిపిస్తోంది. ఇలాంటి ముఖ్యమంత్రి దగ్గర పని చేయడం సంతృప్తినిస్తుంది” అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు.

ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంత స్పష్టత ఉందో, ఏ అధికారి నుంచి ఎలాంటి పనిని రాబట్టుకోవాలో కూడా అంతే స్పష్టత ఉందని కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు చెబుతున్నారు. తప్పుచేసిన వారు తన పార్టీ ఎమ్మెల్యే అయినా సరే ఉపేక్షించరాదంటూ కలెక్టర్లకు చేసిన సూచనపై వివిధ జిల్లాల కలెక్టర్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తమ పనిని అడ్డుకునేది ముందుగా శాసనసభ్యులేనని, అలాంటి వారిని ఉపేక్షించరాదంటూ ముఖ్యమంత్రి స్వయంగా కలెక్టర్ల సమావేశంలో ప్రకటించడం కలెక్టర్లకు నూతన ఉత్తేజం ఇస్తుందని సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన కలెక్టర్లు అభిప్రాయపడుతున్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లు, టెలికాన్పరెన్స్ లు, అంతర్గత సమావేశాల పేరుతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎంతో సమయాన్ని వృధా చేసే వారని, ఈ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలు ఏవీ అమలులోకి వచ్చేవి కావని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకు మధ్య పాలనా పరంగానే కాదు.. వ్యక్తిగత సంబంధాల రీత్యా ఎంతో తేడా ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

First Published:  25 Jun 2019 12:33 AM GMT
Next Story