బీజేపీ ఎమ్మెల్యే దౌర్జన్యం…. బ్యాట్‌తో ప్రభుత్వ అధికారిపై దాడి

అక్రమ కట్టడాలు అనేవి ప్రతీ ఊర్లోనూ ఉండేవే. అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా నిర్మాణాలు జరుపుకోవడం ప్రజాప్రతినిధులకు, వారి అనుచరులకు సాధారణమైన విషయం. ప్రభుత్వాలు మారినప్పుడు మాత్రం ఆ అక్రమ కట్టడాలను కూల్చేస్తుంటే ఎదురు తిరగడం కూడా మామూలే. అయితే ఇక్కడ అక్రమ కట్టడాలను కూల్చేయడానికి వచ్చిన ఒక మున్సిపల్ అధికారిపై స్వయంగా ఒక ఎమ్మెల్యే దాడికి దిగాడు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసే డ్రైవ్ చేపట్టారు. దీనిలో భాగంగా ఒక మున్సిపల్ అధికారి పర్యవేక్షణలో ఇవాళ ఉదయం నుంచి నిర్మాణాలను తొలగిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వార్గియా సదరు అధికారితో వాగ్వివాదానికి దిగాడు. ఇది ప్రభుత్వ నిర్ణయమని చెప్పినా వినిపించుకోకుండా ఏకంగా ఒక క్రికెట్ బ్యాటు తీసుకొని దాడికి పాల్పడ్డాడు.

విచక్షణ కోల్పోయిన ఎమ్మెల్యే.. అధికారిని ఇష్టానుసారం చితకబాదాడు. అంతే కాకుండా అతని అనుచరులు కూడా దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో బీజేపీ నేత హితేష్ బాజ్‌పాయ్ రంగంలోనికి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టారు.

సదరు అధికారి ఎమ్మెల్యేను లంచం అడగటం వల్లే దాడి చేశాడని వెనకేసుకొచ్చారు. కావాలంటే ఎమ్మెల్యే ఆకాష్‌ను అరెస్టు చేసుకోండి. కాని అదే సమయంలో లంచం అడిగిన అధికారిని కూడా జైల్లో పెట్టాలని డిమాండ్ చేశాడు.