బీజేపీ ప్లాన్…. బాబుకు ఇబ్బందులు తప్పవా?

ఏదో జరుగుతోంది. చంద్రబాబు టార్గెట్ గా ఢిల్లీ కేంద్రంగా ప్లాన్లు జరుగుతున్నట్టు అర్థమవుతోంది. మెల్లిమెల్లిగా టీడీపీని దెబ్బతీయడానికి బీజేపీ వేస్తున్న అడుగులు టీడీపీ శిబిరంలో గుబులు పుట్టిస్తున్నాయి.

ఎన్నికలకు ముందు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకుండా చంద్రబాబు చేయాల్సిందంతా చేశారు. ప్రాంతీయ పార్టీలతో జట్టుకట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి బాబు తొక్కని గడప లేదు.. వెళ్లని రాష్ట్రం లేదు. అయితే అదృష్టం బాగుండి రెండోసారి కూడా మోడీ అధికారంలోకి వచ్చారు.

ఇప్పుడు అత్యంత మెజార్టీతో దేశంలో బలవంతుడిగా మారారు.

అందుకే ఇప్పుడు తమను ఇబ్బందిపెట్టిన చంద్రబాబు టార్గెట్ గా ఢిల్లీ పెద్దలు రాజకీయాలు మొదలు పెట్టారు. ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను తీసుకున్న బీజేపీ తాజాగా ఏపీ టీడీపీ సీనియర్ నేత అంబికా కృష్ణకు కూడా బీజేపీ కండువా కప్పింది.

ఇక తాజాగా మోడీకి అత్యంత సన్నిహితుడైన నేతను ఏపీ బీజేపీ బాధ్యుడిగా పెట్టారు. ఇదివరకు ఉన్న మురళీధరన్ ను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయన స్థానంలో 2014 లోక్ సభ ఎన్నికల్లో మోడీకి వారణాసిలో ఎన్నికల మేనేజర్ గా వ్యవహరించిన సునీల్ ధియోధర్ ను ఏపీ బీజేపీ బాధ్యుడిగా నియమించారు.

ఆయన తాజాగా కృష్ణ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ నాయకురాలు పురంధేశ్వరితో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో బీజేపీ వ్యూహాలను బయటపెట్టి సంచలనం రేపారు. రాబోయే రెండేళ్లలోనే చంద్రబాబు విచారణలు ఎదుర్కోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీని నామరూపాల్లేకుండా చేస్తామని.. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బలపడుతామని ఆయన స్పష్టం చేశారు. దీన్ని బట్టి టీడీపీ పార్టీలోని నేతలను ముందు లాగి తర్వాత చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడమే ధ్యేయంగా బీజేపీ ముందుకెళుతున్నట్టు అర్థమవుతోంది.