తెలంగాణ, ఏపీ లో పోలీస్ ఉద్యోగాల భర్తీ…!

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శాంతిభద్రతల రక్షణ కై చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులోభాగంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో 13 వేల పోలీసు ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని హోంమంత్రి సుచరిత ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండు రోజుల పాటు జరిగిన ఎస్పీల సమావేశంలో హోం మంత్రి సుచరిత ఈ ప్రకటన చేశారు.

రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. ఇప్పటికే దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వారాంతపు సెలవు (వీక్లీ ఆఫ్) ప్రకటించింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.

ఈ వారాంతపు సెలవు తో పాటు ఇప్పటికీ కొన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉండడంతో పోలీసులపై పని భారం ఎక్కువవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో పోలీసు ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా హోంమంత్రి సుచరిత ప్రకటించారు.

దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు నెంబర్ వన్ గా నిలవాలని, శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా చేయాలని జగన్మోహన్ రెడ్డి పోలీసులకు ఉద్బోధించారు.

కాల్ మనీ సెక్స్ రాకెట్ లు అరికట్టడంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేకాట క్లబ్ లను కూడా మూసివేయాలని హుకుం జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పోలీసు ఖాళీల భర్తీ కీలకం కానుంది.

తెలంగాణలో కూడా పోలీసు ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయించారు. తెలంగాణలో కూడా చాలా కాలంగా పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో లాగే తెలంగాణలో కూడా పోలీసులకు వారాంతపు సెలవులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దానిని అమలు చేస్తే ఇప్పుడున్న పోలీసుల సంఖ్య సరిపోదు.

హైదరాబాదులో ఉత్సవాలు, వేడుకల నిర్వహణ కత్తి మీద సాము వంటిది. ఇప్పుడున్న పోలీస్ సిబ్బందితో వాటిని ఎదుర్కోవడం, ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమర్థవంతంగా నిర్వహించగలగడం కష్టసాధ్యం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలో పోలీసు శాఖలో 15 వేల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి విధానాలను రూపొందించిన తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడనుంది.