ఉత్తమ్ వారసుడెవరు..? తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం..!

తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికలలో ఘోర పరాజయం… తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తలెత్తుకోలేని దారుణ ఓటమి… ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ముచ్చటగా మూడంటే మూడు స్థానాలతో సరిపెట్టుకున్న స్థితి… ఇదీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.

ఇప్పుడు ఈ పరాజయం, ఓటమి భారం అంతా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి పైనే వేస్తున్నారు స్థానిక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.

పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇవ్వాలంటూ సీనియర్ నాయకులు కొందరు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు.

ఇలా అధ్యక్ష పదవి కోరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు తన వద్ద మంత్రదండం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి ప్రకటించారు. లోక్ సభ ఎన్నికలలో విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పీసీసీ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్ అంధకారమేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.

ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో ఇలాంటి హెచ్చరికలే చేయడం కాంగ్రెస్ పార్టీలో సంచలనం సృష్టిస్తోంది.

పీసీసీ అధ్యక్ష పదవిని ఈసారి బీసీ వర్గాలకు చెందిన నాయకుడికే ఇవ్వాలంటూ సీనియర్ నాయకుడు వి. హనుమంత రావు డిమాండ్ చేస్తున్నారు. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు దూరమైందని, పీసీసీ పదవిని బీసీ వర్గానికి చెందిన నాయకుడికి అప్పగిస్తే బీసీ వర్గాలతో పాటు దళిత, గిరిజన, ఆదివాసీలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారని వి. హన్మంతరావు చెప్తున్నారు.

లోక్ సభ ఎన్నికలలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రేవంత్ రెడ్డి కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని అధిష్టానం భావిస్తే మరో సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఇంతమంది రేసులో ఉండటం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.

పీసీసీ అధ్యక్ష పదవి కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇంత తతంగం జరుగుతున్నా పార్టీ అధిష్టానం మాత్రం తన మార్క్ రాజకీయాన్ని అవలంభిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని, ఈ పదవిలో ఉత్తమే ఉంటారని, వేరెవరినీ నియమించేది లేదంటూ ప్రకటనలు చేయడం కొసమెరుపు.