భారత్-విండీస్ మ్యాచ్ కు వరుణగండం

  • మాంచెస్టర్ వేదికగా రేపే కీలక సమరం
  • మ్యాచ్ వేదికలో గత మూడురోజులుగా భారీవర్షం

ప్రపంచకప్ టైటిల్ వేటలో దూసుకుపోతున్న భారత్ ను…వరుణదేవుడు నీడలా వెంటాడుతూనే ఉన్నాడు. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం వేదికగా గురువారం వెస్టిండీస్ తో జరగాల్సిన ఈ మ్యాచ్ కు సైతం వరుణగండం పొంచి ఉంది.

గత రెండురోజులుగా మ్యాచ్ వేదిక మాంచెస్టర్ లో కుండపోతగా వర్షాలు పడటమే కాదు..దట్టమైన మేఘాలతో ఆకాశం మేఘావృతమవ్వడంతో.. విరాట్ కొహ్లీ అండ్ కో…ఇన్ డోర్ ప్రాక్టీస్ కే పరిమితం కావాల్సి వచ్చింది.

మ్యాచ్ కు ముందు మూడురోజులుగా వర్షాలు పడుతున్నా…మ్యాచ్ రోజున వరుణుడు కరుణించే అవకాశం ఉందని..గ్రేటర్ మాంచెస్టర్ వాతావరణశాఖ ప్రకటించింది.

మరోవైపు…మ్యాచ్ ను పూర్తి 50 ఓవర్ల చొప్పున నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.

చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా ముగిసిన మ్యాచ్ ను ప్రపంచ వ్యాప్తంగా కోటిమంది అభిమానులు వీక్షించడం ఓ రికార్డు కాగా… భారత్ – విండీస్ జట్ల మ్యాచ్ కు సైతం భారీస్థాయిలో ఆదరణ లభించవచ్చునని భావిస్తున్నారు.

పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా భారత్ ఇప్పటి వరకూ ఆడిన ఐదురౌండ్ల మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు, వానదెబ్బతో రద్దయిన ఓ మ్యాచ్ ద్వారా మొత్తం 9 పాయింట్లతో మూడోస్థానంలో కొనసాగుతుంటే… రెండుసార్లు విజేత విండీస్ మాత్రం.. .6 రౌండ్లలో ఒక్కగెలుపు, 4 పరాజయాలతో… లీగ్ టేబుల్ 8వ స్థానంలో నిలిచింది.