తెలంగాణ కొత్త అసెంబ్లీ, సచివాలయాలకు శంకుస్థాపన నేడే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన అసెంబ్లీ, సచివాలయ భవనాలకు ఇవాళ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. పాత సచివాలయం వాస్తుకు అనుగుణంగా లేకపోవడమే కాకుండా ఉద్యోగులకు కూడా సరిపోవడం లేదనే కారణంతో కొత్త భవనాలు నిర్మించాలని సీఎం నిర్ణయించారు. గతంలో ఏపీ వాడుకున్న సచివాలయ భవనాలను కూల్చి ఇక్కడ అధునాతన భవనాన్ని నిర్మించనున్నారు.

సచివాలయ భవనాన్ని డీ-బ్లాక్ వెనుక భాగంలో  ఉన్న చిన్న తోటలో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేసీఆర్ ఈ శంకుస్థాపన చేస్తారు.

ఇక కొత్త అసెంబ్లీ భవనాలను ఎర్రమంజిల్ ప్రాంతంలో నిర్మించనున్నారు. కులీకుతుబ్‌షా నిర్మించిన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చి అక్కడ కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనాన్ని వారసత్వ కట్టడంగా ఉంచి.. దాన్ని ఒక మ్యూజియంగా మార్చనున్నారు. ఎర్రమంజిల్‌లో ఇవాళ దీనికి ఉదయం 12 గంటలకు కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.

కాగా, ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చడంపై కులీకుతుబ్ షా వారసులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని.. కూల్చక తప్పదని కోర్టులో వాదించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక ఈ రెండు భవన సముదాయాల నిర్మాణానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.