Telugu Global
Cinema & Entertainment

'బ్రోచేవారెవరురా' సినిమా రివ్యూ

రివ్యూ: బ్రోచేవారెవరురా రేటింగ్‌: 2.75/5 తారాగణం: శ్రీవిష్ణు, నివేత థామ‌స్‌, స‌త్య‌దేవ్‌, నివేత పేతురాజ్‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు సంగీతం: వివేక్ సాగ‌ర్‌ నిర్మాత: విజ‌య్ కుమార్ మ‌న్యం దర్శకత్వం: వివేక్ ఆత్రేయ‌ అప్పుడెప్పుడో 15 ఏళ్ల కిందట ‘ఐతే’ అనే సినిమా వచ్చింది. అది అప్పట్లో ట్రెండ్ సెట్టర్. అప్పట్నుంచి ఆ తరహా కథలు, స్క్రీన్ ప్లేతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని ఫ్లాప్ అయితే మరికొన్ని హిట్ అవుతున్నాయి. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన […]

బ్రోచేవారెవరురా సినిమా రివ్యూ
X

రివ్యూ: బ్రోచేవారెవరురా
రేటింగ్‌: 2.75/5
తారాగణం: శ్రీవిష్ణు, నివేత థామ‌స్‌, స‌త్య‌దేవ్‌, నివేత పేతురాజ్‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు
సంగీతం: వివేక్ సాగ‌ర్‌
నిర్మాత: విజ‌య్ కుమార్ మ‌న్యం
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ‌

అప్పుడెప్పుడో 15 ఏళ్ల కిందట ‘ఐతే’ అనే సినిమా వచ్చింది. అది అప్పట్లో ట్రెండ్ సెట్టర్. అప్పట్నుంచి ఆ తరహా కథలు, స్క్రీన్ ప్లేతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని ఫ్లాప్ అయితే మరికొన్ని హిట్ అవుతున్నాయి. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన బ్రోచేవారెవరురా మూవీ కూడా దాదాపు అలాంటి స్క్రీన్ ప్లేతోనే వచ్చింది. కాకపోతే ఇప్పటి తరానికి సూటయ్యే మెటీరియల్ ఇందులో పుష్కలంగా ఉంది.

మరీ ముఖ్యంగా ఈకాలం సినిమాల్లో ఏది ఉన్నా లేకపోయినా ఫన్ మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే. ఈ విషయంలో బ్రోచేవారెవరురా సినిమా సక్సెస్ అయింది. పేరుకు ఇది క్రైమ్ డ్రామా అయినప్పటికీ మినిమం గ్యాప్స్ లో ఎక్కడా టెంపో మిస్ అవ్వకుండా కామెడీ పండించిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ విషయంలో కేవలం ఒకరిద్దర్ని చెప్పుకోవడానికి వీల్లేదు. కమెడియన్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శితో పాటు అక్కడక్కడ శివాజీరాజా, హర్షవర్థన్ తో పాటు విలన్లు కూడా కామెడీ పండించేశారు. పైపెచ్చు ఆ కామెడీ క్లిక్ అవ్వడంతో బ్రోచేవారెవరురా మూవీ సేఫ్ వెంచర్ అనిపించుకుంది.

మూడు సార్లు ఇంటర్ తప్పుతారు రాహుల్ (శ్రీవిష్ణు), రాంకీ (ప్రియదర్శి), రాంబో (రాహుల్ రామకృష్ణ). వీళ్లను ఆర్-3 బ్యాచ్ అంటారు. వీళ్లకు చదువు అస్సలు పడదు. వీళ్లకు ఏమాత్రం తీసిపోదు మిత్ర(నివేత థామస్). ఈమెకు కూడా చదువు అబ్బదు. సో.. సహజంగానే వీళ్లంతా ఫ్రెండ్స్ అవుతారు.

కట్ చేస్తే.. ఇదే సినిమాలో మరో కథ నడుస్తుంటుంది. విశాల్ (సత్యదేవ్) పెద్ద ఉద్యోగం వదిలిపెట్టి మరీ దర్శకుడు అవుదామని ఇండస్ట్రీకి వస్తాడు. హీరోయిన్ షాలు (నివేత పెతురాజ్)కు కథ చెబుతుంటాడు. ఇలా రెండు స్టోరీ ట్రాక్స్ సమాంతరంగా నడుస్తుంటాయి. ఈ రెండు కథలు సినిమాలో ఎలా కలిశాయి.. ఎక్కడ కలిశాయి.. ఫైనల్ గా వీళ్ల జీవితాల్లో ఏం జరిగిందనేది స్టోరీ.

రెండు కథలు కాదు, ఒకే సినిమాలో అరడజను కథలు కూడా చూపించిన చిత్రాలు వచ్చాయి. కానీ ఆ కథల్లో లేని నావల్టీ ఈ సినిమాలో ఉంది. అదేంటంటే.. కాలేజ్ బ్యాక్ డ్రాప్ ఉన్న కుర్రాళ్లకు, సినీ నేపథ్యం ఉన్న కథను మిక్స్ చేయడం. పైగా ఆ కథను చక్కటి-చిక్కటి స్క్రీన్ ప్లేతో నడిపించడం. ఈ విషయంలో దర్శకుడు వివేక్ ఆత్రేయకు ఫస్ట్ క్లాస్ మార్కులు వేయాల్సిందే. అతడు చక్కగా రాసుకున్నాడు ఈ కథను. అంతే చక్కగా తెరపై కూడా చూపించగలిగాడు.

వివేక్ ఆత్రేయ తర్వాత మెచ్చుకోదగ్గ వ్యక్తి వివేక్ సాగర్. ఈ సినిమాకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు వివేక్ సాగర్. సినిమా పూర్తయిన తర్వాత అంతా ఈ ఆర్-ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారంటే ఇతడి టాలెంట్ ను అర్థంచేసుకోవచ్చు. వీళ్లకు సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, ఆర్ట్ డైరక్టర్ నుంచి పూర్తి సహకారం లభించింది. ఇలా టెక్నీషియన్స్ అంతా కలిసికట్టుగా ‘బ్రోచేవారెవరురా’ సినిమాను సక్సెస్ చేశారు.

మరోవైపు నటీనటుల్ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి పోటీపడి నటించారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో వీళ్లు ముగ్గురూ హీరోలే. వాళ్ల పాత్రలకు వీళ్లు పెర్ ఫెక్ట్ గా సూటయ్యారు. ఇక నివేత థామస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సహజ నటనకు పెట్టింది పేరైన ఈ హీరోయిన్, బ్రోచేవారెవరురా సినిమాతో మరోసారి తన టాలెంట్ చూపించింది. ఆమె యాక్టింగ్, క్లాసికల్ డాన్స్ ఈ సినిమాకు హైలెట్స్. వీళ్లతో పాటు నటించిన సత్యదేవ్, నివేత పెతురాజ్, శివాజీరాజా లాంటి నటులంతా తమ పాత్రలకు పూర్తిన్యాయం చేశారు.

సినిమాలో ఇలా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ, బలహీనతలు కూడా లేకపోలేదు. మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో ఈ లోపాలు కనిపిస్తాయి. ఫస్టాఫ్ లో ఉన్నంత గ్రిప్పింగ్ నెరేషన్ సెకెండాఫ్ లో కనిపించదు. సుదీర్ఘంగా రాసుకున్న ఎపిసోడ్స్ కారణంగా సెకెండాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది.

సినిమాటిక్ స్వేచ్ఛ ఎక్కువగా తీసుకోవడం కూడా కొందరికి నచ్చకపోవచ్చు. దీనికితోడు క్లైమాక్స్ ను ఒక్క దెబ్బతో అలా ముగించేస్తారు. ఇదేంటి ఇలా క్లోజ్ అయింది ఈ సినిమా అనే ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే.. బ్రోచేవారెవరురా మూవీలో పెద్దగా వంకలు పెట్టడానికేం లేవు.

  • బలాలు

నటీనటుల పెర్ఫార్మెన్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కామెడీ, స్క్రీన్ ప్లే

  • బలహీనలు

సెకండాఫ్ సాగతీత, వీక్ క్లయిమాక్స్

బాటమ్ లైన్

ఇంతకుముందే చెప్పుకున్నట్టు బ్రోచేవారెవరురా సినిమా కొత్త కథ కాదు. మనందరికీ తెలిసిన కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే నటీనటుల పెర్ఫార్మెన్సులు, సందర్భానుసారం వచ్చే కామెడీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను ముందువరుసలో నిలబెట్టాయి. మంచి కామెడీ పంచ్ లు, చక్కటి స్క్రీన్ ప్లే కోసం ఈ సినిమాను చూడొచ్చు

First Published:  28 Jun 2019 5:58 AM GMT
Next Story