ఫేస్ బుక్ తో ట్రాప్…. బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ పట్టించింది

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్స్ ఆప్…. నేటి యువతరం వీటి బారిన పడి మోసపోతోంది. ఉదయం లేచిన దగ్గర నుండి అర్దరాత్రి వరకూ సోషల్ మీడియాతోనే కాలం గడుపుతోంది నేటి యువత. ఈ ఆన్ లైన్ చాటింగ్ లలో పరిచయాలు ప్రేమగా మారుతున్నాయి. ఆ తర్వాత తాము మోసపోయామని తెలుసుకుని…. ఆర్ధికంగా నష్టపోవడమే కాక తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నారు.

ఇంట్లో చెప్పుకోలేక, స్నేహితులతో పంచుకోలేక మనస్తాపంతో కొందరు ఆత్మహత్యకు కూడా పాల్పడడం విషాదం. ఇలా మోసపోయిన వారిలో కొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నా, పరువు పోతుందనే భయంతో పోలీసులకు చెప్పని వారూ ఉన్నారు.

తాజాగా విశాఖపట్నానికి చెందిన మహేశ్వర రావు అనే యువకుడు సోషల్ మీడియాను నమ్ముకుని దాని బారిన పడ్డారు.

విశాఖపట్నానికి చెందిన మహేశ్వర రావుకు సంవత్సరం క్రితం సంధ్య ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆడపిల్ల పేరుతో రిక్వెస్ట్ రావడంతో మహేశ్వర రావు వెంటనే ఆ రిక్వెస్ట్ ను అంగీకరించాడు. ఇంకేముంది… రోజూ చాటింగ్ చేస్తూ పీకల లోతు ప్రేమలో పడిపోయాడు మహేశ్వర రావు.

దీంతో ఫేస్ బుక్ ఫ్రెండ్ సంధ్య తనకు చాలా ఆర్దిక ఇబ్బందులు ఉన్నాయని, తన కుటుంబానికి తానే ఆధారమని నమ్మించింది. తాను ప్రేమించిన యువతి కష్టం చూసి తట్టుకోలేకపోయాడు మహేశ్వరరావు. ఆమె అడిగినప్పుడల్లా సంధ్య అకౌంట్ లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసాడు. ఇలా దాదాపు 4 లక్షల రూపాయలు సంధ్య అకౌంట్ లో వేసాడు మహేశ్వరరావు.

ఆ తర్వాత కొన్ని రోజుల పాటు సంధ్య దగ్గర నుంచి ఎటువంటి మెసేజ్ లు లేకపోవడంతో మహేశ్వర రావు తీవ్ర మానసిక వేదన అనుభవించాడు. మూడు నెలల తర్వాత సంధ్య తనకు తన బావతో బలవంతంగా పెళ్లి చేసారని, పెళ్లి తర్వాత తన బావ తనను అమెరికా తీసుకుని వెళ్లాడని మహేశ్వర రావును నమ్మించింది.

అంతే కాకుండా తనకు తన బావతో ఉండడం ఇష్టం లేదని, మరో 25 వేలు వేస్తే తాను అమెరికా నుంచి ఇండియా తిరిగి వస్తానని, అప్పుడు మహేశ్వర రావును పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తన అకౌంట్ నంబరును కూడా ఇచ్చింది. అయితే సంధ్య అమెరికాలో ఉంటూ, ఇండియాకు చెందిన బ్యాంక్ అకౌంట్ నంబరు ఇవ్వడంతో అనుమానం వచ్చిన మహేశ్వర రావు విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

వివరాలను కూపి లాగిన పోలీసులకు సదరు సంధ్య అసలు అమ్మాయే కాదని, అబ్బాయని తేలింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కంచుస్తంభం జగదీష్ గా గుర్తించారు. జగదీష్ గతంలో కూడా మరో ఇద్దరిని ట్రాప్ లోకి లాగి వారినీ మోసం చేశాడని పోలీసులు చెబుతున్నారు. మహేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.