ఫస్ట్ వీక్ దుమ్ముదులిపిన కబీర్ సింగ్

తెలుగులో కల్ట్ మూవీగా పేరుతెచ్చుకున్న అర్జున్ రెడ్డి, హిందీలో కబీర్ సింగ్ పేరిట తెరకెక్కిన విషయం తెలిసిందే. షాహిద్ కపూర్, కైరా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్టయింది. నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇండియా వైడ్ 134 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

తొలిరోజు మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 3 రోజుల తర్వాత చతికిలపడుతుందని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ యూత్ కు కనెక్ట్ అయింది కబీర్ సింగ్ సినిమా. దీంతో కళ్లముందే వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఆ వెంటనే 134 కోట్లు వచ్చేశాయి. రెండో వారంలో ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో కూడా చేరుతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

ఈ సినిమాతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. కబీర్ సింగ్ తర్వాత తెలుగులో సినిమా చేయాలని అనుకున్న ఈ దర్శకుడికి, ఇప్పుడు బాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా బడా హీరోలు ఇతడితో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి, తన నెక్ట్స్ సినిమాను సందీప్ రెడ్డి ఏ భాషలో తీస్తాడో చూడాలి.