నరుకుతామన్నాడు… నెలకే జంప్‌ అవుతున్నాడు…

ధర్మవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సర్దుకుంటున్నాడు. బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ అంశాన్ని వివరించేందుకు అనుచరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాడు. తన పరిస్థితిని వివరించి బీజేపీలో చేరడం ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షితమని అభిప్రాయపడ్డాడు. సూరి మాటకు అనుచరులు కూడా సై అన్నారు.

టీడీపీ హయాంలో పలు కాంట్రాక్టుల ద్వారా సూరి బాగానే వెనకేసుకున్నారన్న చర్చ ఉంది. పలు క్వారీలు కూడా ఈయన ఆధీనంలో నడుస్తున్నాయి. వీటికి సంబంధించి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతోనే బీజేపీలోకి సూరి వెళ్తున్నాడని టీడీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ వీడవద్దని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు నడిపిన రాయబారం కూడా ఫలించలేదు.

ఎన్నికల ప్రచార సమయంలో తిరిగి గెలిచేది టీడీపీనే… అప్పుడు ఆరు నెలలు స్వేచ్చ ఇస్తా ప్రత్యర్థులను నరకండి… అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చిన సూరి… ఇప్పుడు ఎన్నికలు ముగిసిన నెలకే పార్టీ మారేందుకు సిద్ధమవడం టీడీపీలోనూ చర్చనీయాంశమైంది.