30 రూపాయలు అడిగిందని విడాకులిచ్చిన భర్త

కేవలం 30 రూపాయలు.. అది కూడా ఇంట్లో కూరగాయలు కొనడానికి భర్తను అడిగితే.. కోపోద్రిక్తుడై వెంటనే భార్యకు విడాకులు ఇచ్చాడు. ముమ్మరు తలాక్ చెప్పి ఆమెకు ‘ఇక నువ్వు నా భార్యవు కావు’ అని చెప్పాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడా ప్రాంతంలో జైనాబ్ అనే మహిళ తన భర్త సాబీర్‌తో కలిసి నివసిస్తోంది. గత నెల 29న కూరగాయలు కొనడానికి 30 రూపాయలు అడగ్గా.. భర్తతో గొడవ జరిగింది. భర్త డబ్బులు ఇవ్వకపోవడమే కాక ఆమెను తీవ్రంగా దూషిస్తూ మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేశానని బాధితురాలితో చెప్పాడు.

దీంతో జైనాబ్ తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వాళ్లు పోలీసులకు పిర్యాదు చేశారు. జైనాబ్ గాయపడటంతో ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు ఐపీసీ 498-ఏ, 506 సెక్షన్ల కింద సాబీర్‌తో పాటు వారి కుటుంబసభ్యులను అరెస్టు చేశారు.