ప్రభుత్వ అధికారిపై బురద పోసిన ఎమ్మెల్యే

తెలంగాణలోని కొమురంభీం జిల్లాలో అటవీ అధికారిపై దాడి. ఖమ్మంలోనూ అదే కథ. ఏకంగా చితకబాదేశారు. ఇప్పుడు మహారాష్ట్రలోనూ దారుణం జరిగింది. అయితే తెలంగాణలో ప్రజలు తిరగబడితే మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే అధికారిపై అత్యంత దారుణంగా వ్యవహరించాడు. ప్రభుత్వ ఉద్యోగిపై భౌతికంగా దాడికి పాల్పడడం సంచలనంగా మారింది.

మహారాష్ట్రలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నితీష్ రాణా అధికారులతో దారుణంగా వ్యవహరించడం కలకలం రేపింది. గోవా-ముంబై హైవే పై ఏర్పడిన గుంతలను అధికారులు పరిశీలిస్తుండగా ఈ దారుణం జరిగింది.

ఇదే క్రమంలో అక్కడికి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నితీష్ రాణా గుంతలను పూడ్చరా అని ఆ గుంతల్లోని బురదను బకెట్లలో ఎత్తి అధికారులకు స్నానం చేయించాడు.

అనంతరం ఓ ప్రభుత్వ ఇంజనీర్ ను అదే బ్రిడ్జికి కట్టేసేందుకు ప్రయత్నించడం దుమారం రేపింది. స్థానికులు, పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

అయితే ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎమ్మెల్యే తీరును అందరూ తప్పు పడుతున్నారు. అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని కోరుతున్నారు.