అసెంబ్లీలోకి నిమ్మకాయలు నిషేధం… చేతబడి భయం…

కర్నాటకలో నేతలకు మూడనమ్మకాలు రానురాను పెరిగిపోతున్నాయి. నిమ్మకాయలను చూసినా నేతలు భయపడుతున్నారు. కుంటుతూ నడుస్తున్న కుమారస్వామి ప్రభుత్వం అనుమానంతో కాలం వెళ్లదీస్తోంది. తమను ఏదో చేసేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారన్న భయం సీఎం నుంచి మంత్రుల వరకు తయారైంది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేతబడి చేస్తారన్న భయం కూడా వారికి పట్టుకుంది. అందుకే అసెంబ్లీ భవనం విధానసౌధలోకి నిమ్మకాయలను నిషేధించారు. సిబ్బంది జ్యూస్‌ కోసం తెచ్చుకున్నా సరే లోనికి అనుమతించడం లేదు. వాహనాల్లో గానీ, వ్యక్తుల వద్దగానీ నిమ్మకాయలు కనిపిస్తే భద్రతా సిబ్బంది గట్టిగా ప్రశ్నిస్తున్నారు. నిమ్మకాయలతో పనేంటని అడుగుతున్నారు.

కొందరు వ్యక్తులు మంత్రించిన నిమ్మకాయలను తెచ్చి తమ చాంబర్లలో వేస్తున్నారని మంత్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రించిన నిమ్మకాయలు, చేతబడి చేసిన నిమ్మకాయలను తెచ్చి తమను ప్రభావితం చేస్తున్నారని కొందరు మంత్రులు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలోనే విధానసౌధలో నిమ్మకాయల నిషేధాన్ని గట్టిగా అమలు చేస్తున్నారు. అయితే కుమారస్వామి సోదరుడు రేవణ్ణ మాత్రం ఇప్పటికీ నిమ్మకాయలను చేతిలో పట్టుకునే తిరుగుతుంటారు.