Telugu Global
NEWS

ప్రపంచకప్ లో ఫాస్ట్ బౌలర్ల హవా

24 వికెట్లతో మిషెల్ స్టార్క్ టాప్  17 వికెట్లతో ఫెర్గూసన్, ఆర్చర్  14 వికెట్లతో 8వ స్థానంలో షమీ ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో ఫాస్ట్ బౌలర్ల జోరు కొనసాగుతోంది. ఇంగ్లీష్ సీమర్ ఫ్రెండ్లీ పిచ్ లపై.. లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్లు చేలరేగిపోతున్నారు. పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 45 మ్యాచ్ లు ముగిసే సమయానికి…కంగారూ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ 24 వికెట్లతో బౌలర్ నంబర్ వన్ గా నిలిచాడు. […]

ప్రపంచకప్ లో ఫాస్ట్ బౌలర్ల హవా
X
  • 24 వికెట్లతో మిషెల్ స్టార్క్ టాప్
  • 17 వికెట్లతో ఫెర్గూసన్, ఆర్చర్
  • 14 వికెట్లతో 8వ స్థానంలో షమీ

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో ఫాస్ట్ బౌలర్ల జోరు కొనసాగుతోంది. ఇంగ్లీష్ సీమర్ ఫ్రెండ్లీ పిచ్ లపై.. లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్లు చేలరేగిపోతున్నారు.

పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 45 మ్యాచ్ లు ముగిసే సమయానికి…కంగారూ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ 24 వికెట్లతో బౌలర్ నంబర్ వన్ గా నిలిచాడు.

స్టార్క్ సూపర్ స్పార్క్….

ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి సెమీఫైనల్స్ చేరడంలో లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ ప్రధానపాత్ర వహించాడు.

రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 8 రౌండ్లలో కంగారూ టీమ్ ఆడిన మ్యాచ్ ల్లో స్టార్క్ మొత్తం 74.2 ఓవర్లలో 5 మేడిన్ ఓవర్లతో 316 పరుగులిచ్చి 24 వికెట్లు సాధించాడు. అంతే కాదు…మూడుసార్లు 5 వికెట్ల చొప్పున పడగొట్టాడు.

బ్యాటింగ్ లో ఓ ఆటగాడు సెంచరీ సాధిస్తే ఎంత గొప్పో…బౌలింగ్ లో ఓ బౌలర్ మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టినా అంతే గొప్పగా పరిగణిస్తారు.

రెండో స్థానంలో ఫెర్గూసన్..

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ల్యూక్ ఫెర్గూసన్ కేవలం 7 మ్యాచ్ ల్లోనే 63.4 ఓవర్లు బౌల్ చేసి…17 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మాత్రం 9 రౌండ్లలో 80.5 ఓవర్లు బౌల్ చేసి …387 పరుగులిచ్చి 17 వికెట్ల రికార్డుతో మూడో స్థానంలో నిలిచాడు.

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్, ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్…చెరో 16 వికెట్లు పడగొట్టగా…కివీ తురుపుముక్క ట్రెంట్ బౌల్ట్ 15 వికెట్లతో ఆరో స్థానంలోనిలిచాడు.

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ..కేవలం 4 మ్యాచ్ ల్లోనే 36.1 ఓవర్లలో 193 పరుగులిచ్చి 14 వికెట్లతో 8వస్థానంలో ఉన్నాడు.

జస్ ప్రీత్ బుమ్రా 7 మ్యాచ్ ల్లో 14 వికెట్లతో షమీ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.

స్పిన్నర్లలో షకీబుల్ టాప్…

ఫాస్ట్ బౌలర్ల షోగా సాగుతున్న ప్రస్తుత ప్రపంచకప్ లీగ్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్నర్లుగా బంగ్లాదేశ్ సూపర్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్, భారత లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ సంయుక్త ఆగ్రస్థానంలో నిలిచారు. ఈ ఇద్దరూ చెరో 11 వికెట్లు చొప్పున పడగొట్టారు.

షకీబుల్ 7 మ్యాచ్ ల్లో 64 ఓవర్లు బౌల్ చేసి..342 పరుగులిచ్చి 11 వికెట్లు సాధిస్తే…చహల్ మాత్రం 7 మ్యాచ్ ల్లో 379 పరుగులిచ్చి 11 వికెట్లే తీయడం విశేషం.

లెఫ్టామ్ పేసర్ల దూకుడు…

ప్రస్తుత ప్రపంచకప్ మొదటి 45 మ్యాచ్ ల్లో… వివిధ జట్లకు చెందిన లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ల ఆధిపత్యమే కొనసాగుతోంది.

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్, న్యూజిలాండ్ ఓపెనింగ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, పాక్ ఓపెనింగ్ బౌలర్ మహ్మద్ అమీర్, బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్, విండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కోట్రెల్, పాక్ యువపేసర్ మహ్మద్ షహీన్ అఫ్రిదీ..ఇలా అందరూ ఎడమచేతి వాటం బౌలర్లే కావడం విశేషం.

45 మ్యాచ్ ల్లో రెండే హ్యాట్రిక్ లు…

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 45 రౌండ్ల మ్యాచ్ ల్లో రెండంటే రెండుమాత్రమే హ్యాట్రిక్ లు నమోదయ్యాయి. తొలి హ్యాట్రిక్ ను.. అప్ఘనిస్థాన్ పై భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ నమోదు చేయడం ద్వారా బోణీ కొట్టాడు.

టోర్నీ రెండో హ్యాట్రిక్ ను న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ సాధించాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన లీగ్ మ్యాచ్ లో బౌల్ట్ ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

బ్యాటింగ్ లో సెంచరీల మోత మోగుతున్నా…బౌలింగ్ లో మాత్రం రెండు హ్యాట్రిక్ లే నమోదు కావడం చూస్తే…ప్రస్తుత ప్రపంచకప్.. బ్యాట్స్ మన్ టోర్నీగా, పరుగుల పండుగలా సాగుతోందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  4 July 2019 11:35 PM GMT
Next Story