సంక్షోభంలో కాంగ్రెస్‌-జేడీఎస్ ప్రభుత్వం…

కర్నాటకలో రాజకీయ సంక్షోభం ముదిరింది.  లోక్‌సభ ఎన్నికల తర్వాత దిగజారుతూ వస్తున్న కాంగ్రెస్‌- జేడీఎస్ ప్రభుత్వ పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారింది.

కాంగ్రెస్‌, జేడీఎస్‌కు చెందిన 15 మంది రాజీనామాలు చేశారు. వారిలో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. ప్రస్తుతం కర్నాటక అసెంబ్లీలో బీజేపీ బలం 105గా ఉంది.

కాంగ్రెస్ 78, జేడీఎస్‌ 37,బీఎస్పీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్లు ఇద్దరు ఉన్నారు. రాజీనామాలు చేసిన వారిలో ప్రతాప్‌ గౌడ, శివరాం, రమేష్, బీసీ పాటిల్, గోపాలయ్య, మహేష్ కుమటి, విశ్వనాథ్, నారాయణ గౌడ తదితరులు ఉన్నారు. వీళ్ళకు సీనియర్ నేత విశ్వనాథ్‌ నాయకత్వం వహిస్తున్నట్టు జేడీఎస్ అనుమానిస్తోంది. గతంలో జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా విశ్వనాథ్‌ పనిచేశారు.

15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే ఆ మేరకు సభలో సభ్యుల సంఖ్య తగ్గిపోనుంది.  దాంతో బీజేపీ సభలో 105 సభ్యులతోనే మేజిక్ ఫిగర్ ను అందుకోనుంది.  ప్రస్తుతం కుమారస్వామి అమెరికాలో ఉన్నారు. రేపు రాత్రికి ఆయన బెంగళూరు వస్తారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున గెలిచే ఆలోచనతో ఉన్నారు.