సీబీఐ నుంచి నాగేశ్వ‌ర‌రావు ఔట్ !

సీబీఐ అద‌న‌పు డైరెక్ట‌ర్ ప‌ద‌వి నుంచి మన్నెం నాగేశ్వ‌ర‌రావును కేంద్రం తొల‌గించింది. ఫైర్ స‌ర్వీసెస్ డీజీగా బ‌దిలీ చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. నాగేశ్వ‌ర‌రావుపై ప‌లు అవినీతి ఆరోప‌ణ‌లు రావడంతో కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

భార్య పేరుతో రుణాలు, షెల్ కంపెనీల‌తో సంబంధాలు ఉన్నాయ‌ని నాగేశ్వ‌ర‌రావుపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. అంతేకాకుండా కోర్టు ధిక్కారానికి పాల్ప‌డ్డ కేసులోనూ నాగేశ్వర‌రావును సుప్రీంకోర్టు త‌ప్పుప‌ట్టింది. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఆదేశాల‌ను ధిక్క‌రిస్తూ నాగేశ్వ‌ర‌రావు అధికారుల‌ను బ‌దిలీ చేశారు.

దీంతో అప్పుడు కోర్టు నాగేశ్వ‌ర‌రావుకు మొట్టికాయ‌లు వేసింది. కోర్టు ధిక్కారానికి పాల్ప‌డడంతో…. కోర్టు కార్యకలాపాలు ముగిసే వరకు రోజంతా కోర్టు గదిలో ఓ మూలన ఉండాలని నాగేశ్వరరావును ఆదేశించింది. అంతేగాకుండా రూ.లక్ష జరిమానా కూడా విధించింది. దీంతో ఒకరోజు మొత్తం మన్నెం నాగేశ్వరరావు కోర్టులోనే ఉండి శిక్ష అనుభవించాడు.

ఐదేళ్ల కింద‌ట బీజేపీ అధికారంలోకి రావ‌డంతో అప్పుడు ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉన్న తెలుగు రాష్ట్రాల‌కు చెందిన కీల‌క వ్య‌క్తి అండ‌దండల‌తో సీబీఐలోకి నాగేశ్వ‌ర‌రావు ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత అదే శాఖ‌లో వివాద‌స్ప‌ద వ్య‌క్తిగా పేరుపొందారు. ఆయ‌న భార్య పేరిట ప‌లు వ్యాపారాలు ఉన్నాయి. అంతేకాకుండా షెల్ కంపెనీల పేరుతో కోట్ల లావాదేవీలు న‌డిపార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

నాగేశ్వరరావుకు చెందిన ఆస్తులపై కోల్‌కతా పోలీసులు గ‌తంలో సోదాలు నిర్వహించారు. నాగేశ్వరరావు భార్య, కూతురు ప్రమేయంతో ఆర్థిక లావాదేవీలు నడిచే ఓ కంపెనీ, సాల్ట్‌లేక్‌లో ఆయన భార్య ఆధ్వర్యంలో నడుస్తున్న ఏంజెలినా మెర్సంటైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీ లావాదేవీల‌పై అప్ప‌ట్లో ప‌లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

మన్నెం నాగేశ్వరరావు ఒడిషా, చత్తీస్‌గఢ్‌లో పనిచేసిన సమయంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అందులో కొన్ని సంచలనం సృష్టించిన కుంభకోణాలు కూడా ఉన్నాయి.

మ‌రోవైపు త‌మిళ‌నాడులో ప‌నిచేసినప్పుడు కూడా అవినీతికి పాల్ప‌డ్డార‌ని అక్క‌డి ప‌త్రిక‌ల్లో సంచ‌ల‌న క‌థ‌నాలు వ‌చ్చాయి. అంతేకాకుండా ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న‌ప్పుడు యూనిఫామ్‌ల కొనుగోలులో భారీ అవినీతికి పాల్ప‌డ్డార‌ని ప‌త్రిక‌ల్లో స్టోరీలు ప్ర‌చురించాయి.

మొత్తానికి నాగేశ్వ‌ర‌రావుపై వ‌రుస ఫిర్యాదులు..సిబీఐలో మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో నాగేశ్వ‌ర‌రావును అక్క‌డి నుంచి సాగ‌నంపార‌ని తెలుస్తోంది.