బీజేపీ వైపు టీఆర్ఎస్ యువ‌ నేత‌ చూపు !

తెలంగాణ‌లో అమిత్‌షా ప‌ర్య‌టన ముగిసింది. మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర్‌రావు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చంద్ర‌వ‌ద‌న్ బీజేపీలో చేరారు. ఇక చెప్పుకోద‌గ్గ నేతలు ఎవ‌రూ బీజేపీ వైపు రాలేదు. అయితే మంచి ముహూర్తం లేక‌పోవ‌డంతో పాటు ఇత‌ర సంప్ర‌దింపులు పూర్తి కాక‌పోవ‌డంతో నేత‌ల చేరిక వాయిదా ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

అమిత్ షా కూడా త‌న ప్ర‌సంగంలో బీజేపీలోకి కొత్త నేతలు రావాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి చెప్పారు. అంటే రాబోయే రోజుల్లో కీల‌క నేత‌లకు వ‌ల వేసే కార్య‌క్ర‌మం కొన‌సాగ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు శంషాబాద్ నోవాటెల్ హోట‌ల్‌లో అమిత్‌షా తెలంగాణ బీజేపీ నేత‌ల కోర్‌క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి పాత‌,కొత్త బీజేపీ నేత‌ల‌ను ఆహ్వానించారు. దాదాపు 20 మందికి పైగా నేత‌లు హాజ‌ర‌య్యారు. ఇటీవ‌ల పార్టీలో చేరిన పెద్దిరెడ్డి కూడా ఈ మీటింగ్‌కు వ‌చ్చారు. అయితే టీఆర్ఎస్‌కు చెందిన యువ నేత రావ‌డం క‌ల‌క‌లం రేపింది.

న‌ల్గొండ జిల్లా హూజూర్‌న‌గ‌ర్‌కు చెందిన లేళ్ళ అప్పిరెడ్డి ఎన్ఆర్ఐ. మైక్ టీవీ వెబ్‌సైట్‌, యూ ట్యూబ్ చాన‌ల్ న‌డుపుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో హూజూర్‌న‌గ‌ర్ నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేయాల‌ని అనుకున్నారు. టికెట్ కోసం చివ‌రి నిమిషం వ‌ర‌కు ట్రై చేశారు. శ్రీకాంతా చారి త‌ల్లి ద్వారా రిక‌మండేష‌న్ కూడా చేయించుకున్నారు. కానీ టికెట్ మాత్రం మ‌రో ఎన్ఆర్ఐ సైదిరెడ్డికి ద‌క్కింది. దీంతో అప్ప‌టినుంచి అప్పిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. టీఆర్ఎస్ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.

హూజూర్‌న‌గ‌ర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి న‌ల్గొండ ఎంపీగా ఎన్నిక‌య్యారు. దీంతో మ‌రో ఆరు నెలల్లో ఉప ఎన్నిక‌లు వ‌స్తాయి. టీఆర్ఎస్ టికెట్ మ‌ళ్లీ సైదిరెడ్డికే ద‌క్కే చాన్స్ ఉంది. కాంగ్రెస్ టికెట్ ఉత్త‌మ్ ఫ్యామిలీకి లేదా సీనియ‌ర్ నేత‌లకు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

దీంతో బీజేపీ త‌ర‌పున అక్క‌డ నుంచి పోటీ చేసేందుకు అప్పిరెడ్డి పావులు క‌దుపుతున్నారు. ఇందులో భాగంగా అమిత్‌షాను క‌లిసేందుకు ఆయ‌న శంషాబాద్ నోవాటెల్ కు వెళ్లారు. కోర్ క‌మిటీ మీటింగ్‌కు హాజ‌రయ్యేందుకు లిస్ట్ లో త‌న పేరు లేక‌పోవ‌డంతో వెనుదిరిగారు. అయితే ఆయ‌న త్వ‌ర‌లోనే అమిత్ షాను క‌లిసే అవ‌కాశం ఉంద‌ని మాత్రం తెలుస్తోంది. మొత్తానికి టీఆర్ఎస్‌లో కొంద‌రు నేత‌లు కూడా బీజేపీ వైపు చూస్తున్నార‌ని ప‌క్కాగా స‌మాచారం అందుతోంది.