ఓ బేబీ 2 రోజుల వసూళ్లు

నిన్నటితో 2 రోజులు పూర్తిచేసుకుంది ఓ బేబీ సినిమా. సమంత లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాకు మొదటి రోజే సూపర్ హిట్ టాక్ వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మూవీని మెచ్చుకున్నారు. పైగా సురేష్ బాబు అండతో భారీ ఎత్తున ఈ మూవీని విడుదల చేయగలిగారు.

అలా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదలైన ఓ బేబీ సినిమాకు మొదటి రోజు కోటి 38 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇక నిన్నటి వసూళ్లతో కలుపుకుంటే 2 కోట్ల మార్క్ అందుకుంది ఈ సినిమా. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ గడిచేసరికి ఇది 3 కోట్ల మార్క్ టచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు లాంగ్ రన్ లో ఈ సినిమాకు 8 కోట్ల రూపాయల షేర్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ భావిస్తోంది.

నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన ఈ సినిమా, మిస్ గ్రానీ అనే కొరియన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. దర్శకురాలు నందినీరెడ్డి, రచయిత లక్ష్మీ భూపాల్ ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చారు. ఆ మార్పులతో పాటు సమంత యాక్టింగ్ కలిసిరావడంతో… ఓ బేబీ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఓ బేబీ ఎఫెక్ట్ తో బ్రోచేవారెవరురా సినిమాకు వసూళ్లు తగ్గాయి.