వింబుల్డన్ లో సీడెడ్ స్టార్ల జోరు

  • నాలుగోరౌండ్లో ఫెదరర్, నడాల్ , సెరెనా
  • వింబుల్డన్ నాలుగోరౌండ్లో 17వసారి ఫెదరర్

2019 వింబుల్డన్ టెన్నిస్ పురుషుల, మహిళల సింగిల్స్ లో సీడెడ్ స్టార్ల జోరు కొనసాగుతోంది. స్విస్ కూల్ కూల్ స్టార్ రోజర్ ఫెదరర్, స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్, కంగారూ సంచలనం యాష్లీగీ బార్టీ, అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ పురుషుల, మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు.

ఫెదరర్ 350వ గెలుపు

గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ తన సుదీర్ఘ కెరియర్ లో….గ్రాండ్ స్లామ్ సింగిల్స్ లో 350వ విజయం నమోదు చేశాడు. ఇప్పటికే ఎనిమిదిసార్లు వింబుల్డన్ విజేతగా నిలిచిన ఫెదరర్ 2వ సీడ్ హోదాలో టైటిల్ వేటకు దిగాడు.

మూడోరౌండ్లో ఫ్రెంచ్ ఆటగాడు, 27వ సీడ్ లూకాస్ పాలీని 7-5, 6-2, 7-6తో అధిగమించాడు. వింబుల్డన్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ చేరడం ఫెదరర్ కు ఇది 17వసారి కావడం విశేషం.

క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం జరిగే పోటీలో ఇటలీ ఆటగాడు, 17వ సీడ్ మాటియో బెటినీతో ఫెదరర్ తలపడతాడు.

దూసుకుపోతున్న స్పానిష్ బుల్..

మరో మూడోరౌండ్ పోటీలో స్పానిష్ బుల్, రెండుసార్లు వింబుల్డన్ విన్నర్ రాఫెల్ నడాల్ వరుస సెట్లలో ఫ్రెంచ్ వెటరన్ జో ఆల్ఫ్రెడ్ సోంగాను ఓడించి నాలుగోరౌండ్లో అడుగు పెట్టాడు.నడాల్ 6-3, 6-2, 6-3 తో విజేతగా నిలిచాడు.

వింబుల్డన్ నాలుగో రౌండ్ చేరడం రెండుసార్లు చాంపియన్ నడాల్ కు ఇది తొమ్మిదోసారి.

నాలుగోరౌండ్లో తొలిసారి బార్టీ..

ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్, ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ యాష్లీగీ బార్టీ… తొలిసారిగా వింబుల్డన్ మహిళలసింగిల్స్ నాలుగో రౌండ్ కు చేరుకొంది.

మూడోరౌండ్లో హార్నెట్ బార్టీని 6-1, 6-1 తో చిత్తు చేసింది.

మరో మూడోరౌండ్ పోటీలో మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్.. జర్మన్ ప్లేయర్ జూలియా జార్జెస్ ను 6-3, 6-4తో చిత్తు చేసి… తన కెరియర్ లో 19వసారి వింబుల్డన్ నాలుగో రౌండ్ బెర్త్ సంపాదించింది.