ప్రపంచ మహిళా సాకర్ లో తిరుగులేని అమెరికా

  • ఫీఫా మహిళా ప్రపంచకప్ సాకర్ విజేత అమెరికా 
  • ఫైనల్లో నెదర్లాండ్స్ పై 2-0 గోల్స్ తో విజయం
  • మేగాన్ కు బెస్ట్ ప్లేయర్ అవార్డు

2019 ఫీఫా మహిళా ప్రపంచకప్ సాకర్ టైటిల్ ను డిఫెండింగ్ చాంపియన్ అమెరికా నాలుగోసారి నెగ్గి తనకుతానే సాటిగా నిలిచింది.

ఫ్రాన్స్ లోని లయన్ ఇంటర్నేషనల్ సాకర్ స్టేడియం వేదికగా ముగిసిన ఫైనల్లో నెదర్లాండ్స్ ను అమెరికా 2-0తో అధిగమించింది.

ఆట తొలినిముషం నుంచి నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ టైటిల్ సమరంలో నెదర్లాండ్స్ గట్టిపోటీ ఇచ్చింది.

నెదర్లాండ్స్ గోల్ కీపర్ తనజట్టు రక్షణవలయానికి పెట్టని కోటలా నిలచి అమెరికా దాడులను నిలువరించింది. అయితే అమెరికా స్టార్ ప్లేయర్ మేగాన్ 12 అడుగుల దూరం నుంచి పవర్ ఫుల్ కిక్ తో తనజట్టుకు తొలిగోల్ తో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత రోజ్ లావెల్లీ రెండో గోల్ తో అమెరికా ఆధిక్యాన్ని 2-0కు పెంచడం ద్వారా విజేతగా నిలిపింది.

బెస్ట్ ప్లేయర్ గా మేగాన్…

టోర్నీ మొత్తం లో ఆరుగోల్స్ తో స్టార్ ప్లేయర్ గా నిలిచిన అమెరికన్ స్ట్రయికర్ మేగాన్ లిపియానోకు ..ప్రపంచకప్ అత్యుత్తమ ప్లేయర్ అవార్డు దక్కింది.

మహిళా ప్రపంచకప్ ఫుట్ బాల్ చరిత్రలో ఇప్పటి వరకూ జరిగిన ఎనిమిది టోర్నీలలో వరుసగా మూడుసార్లు ఫైనల్స్ చేరిన అమెరికా విజేతగా నిలవడం ఇది నాలుగోసారి. అంతేకాదు…టైటిల్ ను నిలుపుకొన్న జట్టుగా కూడా నిలిచింది.

ఫైనల్లో పోరాడి ఓడిన నెదర్లాండ్స్ కు రజత పతకంతో సహా రన్నరప్ స్థానం దక్కింది.

స్వీడన్ కు కాంస్యం…

మూడోస్థానం కోసం జరిగిన లూసింగ్ సెమీఫైనలిస్టుల పోరులో స్వీడన్ విజేతగా నిలిచింది. హోరాహోరీ సమరంలో స్వీడన్ 2-1 గోల్స్ తో ఇంగ్లండ్ ను ఓడించి తొలిసారి కాంస్యపతకం అందుకొంది.

మొత్తం మీద 2019 ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ అమెరికా ఆధిపత్యానికి అద్దం పడుతూ ముగిసింది.